తెలంగాణ పోలీసు శాఖలో అత్యంత కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో సీవీ ఆనంద్ ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి నియామకాల్లో శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్ సీపీ పోస్టు ఇవ్వడం ఒకటి. అప్పటి వరకూ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను తప్పించే .. కొత్తకోటకు ఆ పోస్టు ఇచ్చారు. ఎనిమిది నెలలు గడవక ముందే మరోసారి సీవీ ఆనంద్ కు ఆ పోస్టు లభించింది.
సీవీ ఆనంద్ వంక పెట్టలేని సిన్సియర్ అధికారి. చాలా మంది అధికారులపై ఆరోపణలు ఉంటాయని కానీ ఆయనపై మాత్రం ఎలాంటి ఆరోపణలు లేవు. ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిందని వారికి అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపణలు కూడా ఎదుర్కోలేదు. శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ డీజీగా పంపించారు. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించారు. ఈ రెండు పోస్టులను సీవీ ఆనంద్ చూస్తున్నారు.
రేవంత్ రెడ్డి.. రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోతున్న సమయంలో.. సీవీ ఆనంద్ ను హైదరాబాద్ కమిషనర్ గా నియమించడం ఆసక్తి రేపుతోంది. ఏసీబీ చీఫ్ గా.. గత కొంత కాలంగా అవినీతి పరుల గుండెల్లో సీవీ ఆనంద్ రైళ్లు పరుగెత్తిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లను కూడా ఆయన ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు కమిషనర్ గా మళ్లీ రావడంతో ఆయన మార్క్ పోలిసింగ్ మళ్లీ ప్రారంభమవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు సహా కీలకమైనవి సీపీ ముందు ఉన్నాయి.