భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుందన్న సూచనలతో… అందుకు మంత్రి నిమ్మల రామానాయుడు చూపిన చొరవ అందరినీ ఆకట్టుకుంది.
దాదాపు 64 గంటల పాటు నిద్ర లేకుండా, బుడమేరు కట్టపైనే మకాం వేసి అధికారులు, సిబ్బందితో గండ్లు పూడ్చివేతను పర్యవేక్షించిన నిమ్మలను సహచర మంత్రి నారా లోకేష్ అభినందించారు. బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించేందుకు వచ్చిన లోకేశ్…మంత్రి నిమ్మల కష్టాన్ని గుర్తించి అభినందించారు.
ఓ రాత్రి ఈదురుగాలులతో వర్షం పడినా, నిమ్మల ఆ జోరు వర్షంలోనూ తడుస్తూనే పనులు చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుడమేరు గండ్ల పూడిక విషయంలో నిమ్మల నిబద్దతను గమనించిన లోకేష్.. శభాష్ నిమ్మల గారు అంటూ అభినందించారు.
ఇక , బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి కావడంతో విజయవాడ దిగువ ప్రాంతాలకు వెళ్ళే బుడమేరు వరద నీరు ఆగిపోయిందని నిమ్మల తెలిపారు. జక్కంపూడి, సింగ్ నగర్, నిడమానూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.