మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ కొద్ది కాలంగా తన దూకుడు తగ్గించారు. అడపాదడపా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా మునుపటిలా దూకుడుగా వ్యవహరించడం లేదు.దీంతో గద్వాల జేజమ్మ తన సహజశైలిలో అగ్రెసివ్ గా వ్యవహరించకపోవడానికి కారణం ఎంటన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ పోస్ట్ రేసులో డీకే అరుణ కూడా ఉన్నారు.అయినప్పటికీ ఆమె మాత్రం ఈ కీలకమైన సమయంలో పెద్దగా యాక్టివ్ రోల్ పోషించకపోవడానికి కారణం ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఆమె పేరును అధ్యక్ష రేసులో నుంచి తప్పించారని, మరో నేత పేరును అధిష్టానం పరిగణనలోకి తీసుకోవడంతోనే అరుణ తన దూకుడును తగ్గించారా అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
డీకే అరుణ సైలెంట్ కావడానికి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలే కారణమా? రాష్ట్ర నాయకత్వంతో ఏమైనా విబేధాలు తలెత్తాయా? అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకపోవడంతోనే డీకే అరుణ యాక్టివ్ గా కనిపించడం లేదని , అంతేతప్ప ఆమె యాక్టివ్ గా లేరని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె అనుచరులు స్పష్టం చేస్తున్నారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. జేజమ్మ అనూహ్యంగా తన దూకుడు తగ్గించడం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.