తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకమైన ప్లేస్ గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలు. కానీ హైడ్రా రావటంతో ఒక్కసారిగా రియల్ రంగం స్తబ్ధుగా మారిపోయింది. ఎక్కడ భూమి కొనుగోలు చేస్తే ఏం అవుతుందో, ఎక్కడ అనుమతులున్నాయో… ఏదీ బఫర్ జోన్ అనేది తెలియక కొనుగోలుదారులు భయపడుతున్నారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేవారు సైతం ఓ అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
నెల రోజులుగా హైడ్రా దూకుడుగా ఉంది. కూల్చివేతలు, నోటీసులు అంటూ హడావిడి చేస్తోంది. అక్రమంగా అనుమతులు జారీ చేసిన అధికారులపై సైతం కేసులు నమోదవుతుండటంతో… సదరు అధికారులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో చెరువులు, కాలువలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సామాన్యులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు సైతం బఫర్ జోన్స్ పై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టు టేకాఫ్ అయ్యాక హైడ్రా వస్తే హైరానా పడటం ఎందుకు అనుకుంటున్నారు.
గత ఏడాది ఇదే నెలలో… రాజధాని పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం 22కోట్లకు పైగా వస్తే, ఈ ఏడాది కేవలం 10కోట్ల లోపే వచ్చింది. ఇక ప్రస్తుతం రియల్ ఎస్టేట్ హడావిడి ఎక్కువగా ఉన్న జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా. కానీ గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అక్కడ కూడా దస్తావేజుల సంఖ్యతో పాటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది.
అయితే, ఇది తాత్కాలికమేనని… త్వరలోనే మళ్లీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అనిశ్చితి కొంతకాలమే ఉంటుందని, ఇప్పటికే ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ వైపు రియల్ రంగం పరుగులు పెడుతుందని చెబుతున్నారు.