అమరావతిలోని సీఆర్డీఏ చేపట్టిన నివాస అపార్టుమెంట్ల ప్రాజెక్టు హ్యాపీ నెస్ట్ పట్టాలెక్కడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో నిర్మాణం ప్రారంభించిన కాంట్రాక్ట్ సంస్థ కాలపరిమితి తీరిపోవడంతో మళ్లీ టెండర్లు పిలవనున్నారు. శరవేగంగా నిర్మాణం చేసి.. ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఇవ్వనున్నారు.
హ్యాపీ నెస్ట్ ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి జగన్ ప్రభుత్వం చుక్కలు చూపించింది. హ్యాపీకి బదులు బీపీ తెప్పించింది. ప్రాజెక్టు పక్కన పెట్టేసింది. చివరికి వారు రెరాలో పోరాడారు. అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వంపై పెనుభారం పడే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే కొత్త నిర్ణయం తీసుకుంది. నిర్మాణానికి అయ్యే ఖర్చును తామే భరించి అయినా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.
ఐదేళ్ల కిందట ఆపేసిన నిర్మాణాలను ఇప్పటి ధరలతో నిర్మించాలంటే ప్రాజెక్టు ఖర్చు కనీసం యభై శాతం పెరుగుతుంది. జీ ప్లస్ 18 ఫ్లోర్లుగా.. మొత్తం పన్నెండు వందల ఫ్లాట్లను నిర్మించేలా రెడీచేసిన ప్రాజెక్టుకు గంటలోనే బుకింగులు పూర్తవడం రికార్డు. కానీ వారికి ఇప్పటికీ ఇళ్లుఅందలేదు. ఇప్పుడు నిర్మాణానికి అయ్యే అదనపు ఖర్చును ప్రభుత్వమే భరించి.. కొనుగోదారులకు ఫ్లాట్లు ఇవ్వనుంది. వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో ఈ ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి హ్యాండోవర్ చేయనున్నారు.
సీఆర్డీఏకి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం. పడిపోయిన నమ్మకాన్ని పెంచుకోవాలంటే.. ఈ ప్రాజెక్టు ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అలా చేస్తే తర్వాత చేపట్టబోయే ప్రాజెక్టులతో.. అమరావతి పంట పండుతుంది.