డీటైలింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టే దర్శకులలో సుకుమార్ ముందు వరుసలో ఉంటాడు. తన సినిమాలన్నీ లెంగ్తీనే. ‘రంగస్థలం’, ‘పుష్ష’ అందుకు పెద్ద ఉదాహరణలు. రెండూ దాదాపుగా 3 గంటల సినిమాలే. ‘పుష్ష’ 2 గంటల 59 నిమిషాలకు లెక్క తేలింది. అయితే ఇవి రెండూ సూపర్ హిట్లు. కాబట్టి సుకుమార్ కు ఎప్పుడూ లెంగ్తులతో సమస్య రాలేదు. తానూ పట్టించుకోలేదు. ఇప్పుడు ‘పుష్ష 2’ కూడా లెంగ్తీ సినిమానే అని తెలుస్తోంది. ఈ సినిమా నిడివి దాదాపుగా 3 గంటలకు తేలుతోందట. రెండు నిమిషాలు అటూ ఇటూ అవ్వొచ్చు.
ఇప్పటికే ఫస్టాఫ్ ఎడిటింగ్ వర్క్ పూర్తయ్యిందని తెలుస్తోంది. సెకండాఫ్ కు సంబంధించి ఓ పాటతో సహా 20 రోజుల వర్క్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. అక్టోబరు మొదటి వారం నాటికి షూటింగ్ పూర్తి చేసి, సెకండాఫ్ ఎడిటింగ్ మొదలెట్టే ఆలోచనలో ఉన్నారు. ఫహద్ ఫాజల్ కు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్లు పూర్తి చేయాల్సివుంది. యానాంలో ఓ షెడ్యూల్ బాకీ ఉంది. ఆ షెడ్యూల్ తోనే ‘పుష్ష 2’ టాకీ, యాక్షన్ పూర్తవుతాయి. ఓ ఐటెమ్ గీతం తెరకెక్కించాల్సివుంది. పాట రెడీగానే ఉంది. అయితే ఐటెమ్ గాళ్ ఎవరన్నదీ తేలలేదు. ఈవారంలోనే ఐటెమ్ గాళ్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 పాటలు బయటకు వచ్చాయి. మూడో పాట కూడా సిద్ధం అవుతోంది.