తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో కేబినెట్ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న మంత్రివర్గ విస్తరణపై తాజాగా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు రేవంత్.
మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కాని, సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తుండటంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడుతున్నాయి. ఇటీవల పీసీసీ నియామకంలో తన పంతం నెగ్గించుకున్న రేవంత్.. మంత్రివర్గ విస్తరణలోనూ తను కోరిన నేతలకు అవకాశం దక్కేలా పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో సీనియర్లు ఉన్నా..ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో విఫలం అవుతున్నారని,అందుకే కేబినెట్ విస్తరణలో తను కోరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరే అవకాశం ఉంది.
తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని భర్తీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. అయితే, ఈ ఆరు మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా?అనే చర్చ జరుగుతోంది. ఈ ఆరింటిని ఒకేసారి భర్తీ చేస్తే పదవులు రాని సీనియర్ నేతల నుంచి అసంతృప్తి చెలరేగే అవకాశం ఉండటంతో.. నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం.
ఈ కేబినెట్ విస్తరణపై సీనియర్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి , వీరిలో ఎవరికీ చాన్స్ దక్కుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.