దేశంలో స్టాక్ మార్కెట్ పై అవగాహన పెరుగుతోంది. పలితంగా స్టాక్ మార్కెట్లలో షేర్లు కొనడం, అమ్మడాన్ని ఓ వ్యాపారం, వ్యాపకం, వ్యసనంగా మార్చుకున్న వారు పెరుగుతున్నారు. ఇలాంటి వారు పెడుతున్న పెట్టుబడులతో లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. కానీ స్టాక్ మార్కెట్లు లాస్ అయిన రోజున.. సర్వం కోల్పోయే వారు ఎందరో ఉంటున్నారు. అందుకే స్టాక్ మార్కెట్ వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అత్యంత కీలకం.
సెబీ ఎంత పర్ ఫెక్టా ఉంటే.. మదుపుదారులుక అంత భద్రత. కానీ ప్రస్తుత చైర్మన్ మాధవి పురి బుచ్ పై వస్తున్న ఆరోపణలు చూస్తే అసలు ఆమె నిష్పక్షపాతంగా ఎలా ఉండగలరన్న అనుమానాలు సహజంగానే వస్తాయి. హిండెన్ బెర్గ్ మొదట.. అదానీ సంస్థల్లో మాదవి పురి బుచ్ పెట్టుబడుల గురించి బయట పెట్టింది. వాటిని ఆమె కుటుంబం ఖండించలేదు. పెట్టుబడులు లేవని చెప్పలేదు. అప్పట్నుంచి వరుసగా ఆమెపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తో పాటు మహింద్రా, డాక్టర్ రెడ్డీస్ వంటి కంపెనీల నుంచి ఆమె ఆర్థిక ప్రయోజనాలు పొందారని వెల్లడయింది. అదే సమయంలో ఆమె భర్తకు పలు కంపెనీలతో సంబంధాలున్నట్లుగా వెల్లడయింది.
మరో వైపు ఆమె వ్యవహారంపై సెబీ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసనలు కూడా దిగారు. ఇలాంటి సమయంలో సెబీ వ్యవహారంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని కంపెనీలకు ఫేవర్ చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయ. ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ ఆమె మాత్రం తగ్గేది లేదంటున్నారు . రేపు ఏమైనా తేడా కొడితే లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైపోతుంది. సంక్షోఙానికి దారి తీస్తుంది.