హీరోయిన్ జెత్వానీపై పక్కాగా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశామని పోలీసులు అనుకుంటున్నారు కానీ… తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ఓ భ్రమలో అనేక తప్పులు చేశారు. అందులో మొదటిది ముందుగానే విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడం. జెత్వానీపై ఉదయం కేసు వస్తే సాయంత్రం… బెటాలియన్ ను తీసుకునే వెళ్లిపోయారు విశాల్ గున్ని సహా ఇతర అధికారులు. ఓ మహిళను.. అదీ కూడా రూ. ఐదు లక్షల చీటింగ్ కేసులో అరెస్టు చేయడానికి దాదాపుగా రెండు లక్షలు పెట్టి ఫిర్యాదు అందడానికి ముందు రోజే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అది రికార్డెడ్.
ముంబైలో వారు ఉన్న హోటల్.. తిరిగిన కార్ల గురించి పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. జెత్వానీ పోలీసు అధికారులపై ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నివేదికను డీజీపీకి సమర్పించారు. ఇందులో తప్పుడు ఫిర్యాదులు చేయించి తప్పుడు కేసులు పెట్టించారని ఆధారాలతో సహా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. విద్యాసాగర్ చెప్పిన వ్యక్తి తమకు జెత్వానీ భూమి అమ్మలేదని చెప్పడం, ఫిర్యాదు కంటే ముందే ముంబైకి టిక్కెట్లు చేసుకోవడం.. జెత్వానీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడంతో పాటు విజయవాడలో అనధికారికంగా నిర్బంధించి వేధించడం వరకూ అన్ని అంశాలనూ ఆ నివేదికలో అందించారు.
ఈ నివేదిక ప్రకారం పీఎస్ఆర్ ఆంజనేయలు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి తీవ్రమైన అభియోగాలు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారికి అతిపెద్ద మైనస్ ఏమిటంటే… ఈ ఐపీఎస్ అధికారులతో పాటు ఈ తప్పుడు కేసులో భాగమైన వారంతా… అసలేం జరిగిందో చెప్పేయడం. వారంతా అప్రూవర్లుగా మారిపోవడం. వారు చేసిన తప్పుడు పనులకు తాము బలి కావాలనుకోవడం లేదని వారు తేల్చేసుకున్నారు. దీంతో ఈ దారి తప్పి ఐపీఎస్లకు ఎండ్ కార్డ్ పడేందుకు మార్గం సుగమం అయింది.