రాజకీయాల్లో ఎప్పుడూ లేని.. రాకూడదని ఓ దారుణమైన సంస్కృతిని వైసీపీ తెచ్చి పెట్టింది. అధికారం చేతిలో పెట్టుకుని వ్యవస్థలన్నింటిని లొంగ దీసుకుని రాజకీయప్రత్యర్థుల్ని వేధిచింది. ఈ వేధింపులు ఒకరిద్దరికి కాదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ వేధింపులకు గురయ్యారు. వేధింపులకు గురైన ప్రతి ఒక్కరిలోనూ కసి, కోపం ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటామని ఐదేళ్లు శపధాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కానీ అనుకున్నట్లుగా సాగడం లేదు.
బరితెగించిన వారిపై చర్యలేవి ?
టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి వైసీపీ హయాంలో బరి తెగించిన అధికారుల సంఖ్యకు కొదవలేదు. అన్నీ రూల్స్ ప్రకారం ఉన్నా.. వారు చేయని అరాచకం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన బస్సులు, లారీలను పూర్తిగా స్క్రాప్ గా మార్చుకోవాల్సి వచ్చింది. ఎవరికి వారు తమ స్థాయిలో నష్టపోయారు. చివరికి చిన్న తప్పు లేకపోయినా మార్గదర్శిపై జరిగిన దాడి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వారు నష్టపరిహారం అడగడం లేదు. తప్పు చేసిన అధికారుల్ని శిక్షించాలని కోరుతున్నారు. దానికి తగ్గ రియాక్షన్ ఉందా అన్నది మాత్రం డౌటే.
వదిలేస్తే మారిపోయేవారు కాదు !
దాడులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ అందుకోవాలని అనుకోలేకపోవచ్చు కానీ.. అధికారంలోకి వచ్చిన తరవాత కూడా అదే సంప్రదాయం పాటిస్తే మాత్రం… ధైర్యం లేకుండా పోతుంది. పక్కన ఉన్నది ఏ మాత్రం విలువల్లేని నాయకుడు. మనుషుల్ని భౌతికంగా చంపడం కూడా తప్పు కాదనే విపరీత మనస్థత్వం ఉన్నవారు. ఆ పార్టీ నేతల్లోనూ అలాంటి వారే ఎక్కువ. వారికి ఇవ్వాల్సిన ట్రీట్ మెంట్ ఇస్తున్నారా లేదా అన్నది కీలకం . వాళ్లేమీ క్షమిస్తే మారిపోయే రకాలు కాదు.
టీడీపీ క్యాడర్ లో అదే నిరాశ
చట్టం ప్రకారం చేయడమే కరెక్ట్. కానీ ఆ చట్ట ప్రకారం అయినా ఎందుకు వేగంగా చేయడం లేదన్నది కీలకం. తప్పులు చేసినట్లుగా సాక్ష్యాలతో సహ అరెస్టు చేయడానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఎవరిపై చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ వాళ్లను అలా చేశారు కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్లను అలా చేయడంలో తప్పు లేదని సమర్థించే వారు ఎక్కువే ఉంటారు. ఒక వేళ ఏమీ చేయలేకపోతే అతి చేతకాని తనమే అవుతుంది. అదే టీడీపీ క్యాడర్ ను వేధిస్తోంది.