అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడిన ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై తెదేపా ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేయడాన్ని మహిళలే కాదు రాష్ట్ర ప్రజలందరూ ఖండించారు. అంతేకాదు ఆమె నిజాయితీని, సాహసాన్ని అందరూ మెచ్చుకొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై దౌర్జన్యం చేసిన అధికార పార్టీకి చెందిన ఎమ్మేల్యేపై తక్షణమే తగు చర్యలు చేప్పట్టాలని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా గట్టిగా డిమాండ్ చేసాయి. కానీ అందరూ ఊహించినట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మేల్యేని వెనకేసుకువచ్చి అక్రమ ఇసుక రవాణాని అడ్డుకొన్న తహసిల్దార్ దే తప్పు అని నిన్న మంత్రివర్గ సమావేశంలో తేల్చిచెప్పారు.
గ్రామ రికార్డుల గురించి క్షుణ్ణంగా అవగాహన గల తహసిల్దార్, రెవెన్యూ సిబ్బందికి తమ గ్రామ సరిహద్దుల గురించి తెలియవని అనుకోలేము. కానీ ఆమె తన పరిధికి అవతల ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించి ప్రజాప్రతినిధిని అడ్డగించారని నిందించడం మరొక పెద్ద తప్పు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేయడం ఒక నేరమయితే తనని అడ్డుకొన్నందుకు మహిళాధికారిపై దౌర్జన్యం చేయడం మరొక తప్పు. అటువంటి వ్యక్తిని ప్రభుత్వం వెనకేసుకు రావడం అంతకంటే పెద్ద తప్పు.
చింతమనేని వద్ద ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఉందా లేదా? ఆయన తహసిల్దార్ వనజాక్షి పరిధిలోకి రాని ప్రాంతంలో ఇసుక త్రవ్వకాలు చేస్తున్నారా? అనే విషయాలను పక్కనబెడితే ఆయన విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ సిబ్బందిపై, ఒక మహిళ అధికారిపై దౌర్జన్యం చేసారనే మాట వాస్తవం. కానీ ఆయన అధికార పార్టీకి చెందినవారు కనుక ముఖ్యమంత్రి ఆయనని వెనకేసుకు వచ్చారు. కానీ తన ప్రభుత్వం కోసం పోరాడిన వనజాక్షిని, ఆమె సిబ్బందిని మెచ్చుకొని సత్కరించకపోగా వారిదే తప్పు అని చెప్పడం చాలా దారుణం. దానివలన ఉద్యోగుల మనోస్తయిర్యం దెబ్బ తిని ఇక ముందు ప్రజా ప్రతినిధులు ఎవరయినా ఎటువంటి అక్రమాలకు పాల్పడుతున్నా చూసిచూడనట్లు ఊరుకోవలసి వస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని రాజకీయ కోణం నుండి మాత్రమే చూస్తూ చాలా చక్కగా పరిష్కరించానని తృప్తి పడవచ్చును. సదరు ఎమ్మేల్యే కూడా ఆయనకు మరింత బాసటగా నిలబడవచ్చును. కానీ ముఖ్యమంత్రి స్వయంగా అవినీతిపరులకు అండగా నిలుస్తున్నారనే ప్రతిపక్షాల వాదనకు బలం చేకూర్చినట్లయింది. చంద్రబాబు నాయుడు తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకొన్నారు. సదరు ప్రజాప్రతినిధి చేత కనీసం అందరి సమక్షంలో తహసిల్దార్ వనజాక్షికి క్షమాపణలు చెప్పించి ఉన్నా ఆమెతో సహా ఉద్యోగులు ప్రజలు కూడా సంతోషించేవారు. కానీ తన ఉద్యోగధర్మం సక్రమంగా నిర్వహించిన వనజాక్షిదే తప్పు అని చెప్పడం ఎవరూ కూడా హర్షించలేరు.