పార్లమెంటు సమావేశాల రెండో రోజూ షరా మామూలే. రెండో రోజు పరిణామాలను బట్టి చూస్తే, కేంద్రం మరింత పట్టు బిగించింది. విపక్షం పట్టు సడలింది. రాష్ట్రాల అంశాల ప్రస్తావన, లలిత్ మోడీ వివాదం అనే రెండు అంశాల్లోనూ బీజేపీ దూకుడుతో ప్రతిపక్షం గుక్క తిప్పుకోలేక పోయింది. వ్యాపం కుంభకోణం, వసుంధర రాజె వివాదం రాష్ట్రాలకు సంబంధించినవి. అయినా వాటిపై ప్రతిపక్షాలు పార్లమెంటులో రభస చేయడం సరికాదంటూ మొదట రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం చెప్పారు. దానికి నిరసనగా ప్రతిపక్ష సభ్యుల అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది.
పార్లమెంటులో రాష్ట్రాల అంశాలు చర్చించాలని ప్రతిపక్షాలు అంతగా పట్టుబడితే తాము సిద్ధమని జైట్లీ అన్నారు. అయితే కేరళ, అసోం, గోవా ల గురించీ చర్చిద్దామని సవాల్ చేసే సరికి కాంగ్రెస్ గతుక్కుమంది. కేరళలో రెండు మూడు కుంభకోణాలు, అసోం, గోవాల్లో తాజాగా అమెరికా కంపెనీ లంచాల వ్యవహారంపై చర్చించాలనేది జైట్లీ సవాల్ సారాంశం. ఇది కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే విషయం. దీంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. అలా, తమకు మెజారిటీ లేని రాజ్యసభలో కాంగ్రెస్ జైట్లీ చెక్ పెట్టారు. ఆ తర్వాత సీపీఎ: వంతు.
నిన్న తాము చర్చకు ఒప్పుకోలేదని, ముందు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు సుష్మా వివాదంపై కేంద్రం విచారణకు ఆదేశించాలని, అది పూర్తయ్యే వరకు ఆమె పదవిలో ఉండకూడదని వాదించారు. ఈ వాదనమీదా అరుణ్ జైట్లీ ఘాటుగా ఎదురుదాడి చేశారు. సుష్మా ఏ చట్టాన్ని ఉల్లంఘించారని సూటిగా ప్రశ్నించారు. ఏచూరి చాలా మేధావి, ఆమె ఏ చట్టాన్ని ఉల్లంఘించారని కేంద్రం విచారణకు ఆదేశించి, మాకు జ్జాన బోధ చేయాలని వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి ఏచూరి సూటిగా జవాబు చెప్పలేక పోయారు.
ఈ దశలో డిప్యుటీ చైర్మన్ జోక్యం చేసుకున్నారు. చర్చకు అనుమతివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం రెడీగా ఉన్నా, ప్రతిపక్షం ఎందుకు వెనక్కి పోతోందని ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్షం బిత్తరపోయింది. సరిగా సమాధానం చెప్పలేని స్థితిలో కేకలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. అనుకున్నట్టే సభ వాయిదా పడింది.
ఈ మొత్తం వ్యవహారంలో విపక్షం వ్యూహం బెడిసికొట్టింది. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎన్ని రాజీనామా డిమాండ్లు చేసినా, సభలో చర్చకు ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు చర్చించడం సంప్రదాయం. చర్చ సందర్భంగానే సుష్మాపై విమర్శలు చేస్తూ ఆమె రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు. అలా కాకుండా రోజుకో డిమాండ్ తో విపక్షం సభా సమయాన్ని వృథా చేస్తోందని బీజేపీ ఆరోపించే అవకాశం ఇచ్చినట్టయింది. ఒక్కసారి చర్చ జరిగితే ఇక ఈ సమావేశాలు ముగిసే దాకా ఈ అంశాన్ని లెవనెత్తే అవకాశం లేదు. అందుకే, దీనిపై చర్చ విపక్షాలకు ఇష్టం లేనట్టుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.