హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యచేసుకుని చనిపోయిన వరంగల్ విద్యార్థిని రిషికేశ్వరి తాలూకు వివాదం మరింత ముదిరింది. ఈ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రిషికేశ్వరి ఈ నెల 14న హాస్టల్లోని తనగదిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందని మొదట అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. విద్యార్థినిని అర్థనగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారని కొందరు, అసలు అది ఆత్మహత్య కాదు హత్య అని మరికొందరు వాదిస్తున్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపాల్ బాబూరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆత్మహత్యపై ఏర్పాటైన నిజనిర్ధారణ కమిటీ ఇవాళ యూనివర్సిటీకి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్‌కు అనుకూలవర్గం, వ్యతిరేక వర్గం ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈకేసులో ఇప్పటికే అనిషా, శ్రీనివాస్ అనే ఇద్దరు సీనియర విద్యార్థులను, శ్రీచరణ్ అనే లెక్చరర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రిన్సిపాల్ బాబూరావు లీలలు ఒక్కటొక్కటే బయటకొస్తున్నాయి. అతను అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకొచ్చింది. అతనిపై గతంలోకూడా ఎన్నో ఆరోపణలున్నట్లు తెలిసింది.