ఇదివరకు బుద్ధుడు భోధి చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన తరువాత తన జ్ఞాన్నాన్ని లోకానికి పంచిపెట్టారు. మళ్ళీ ఈ మధ్యన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కూడా ఓ రెండ్నెల్లు లాంగ్ లీవ్ పెట్టి విదేశాలలో తిరిగి జ్ఞానం దానితో బాటు కొంచెం దైర్యం కూడా సంపాదించుకొని వచ్చారు. (విదేశాలలో అటువంటివి కూడా అమ్ముతారని తెలిస్తే మన రాజకీయ నాయకులందరూ ఏడు తరాలకి సరిపడంతా జ్ఞానం కొనిపెట్టుకొని ఉండేవారు. కానీ అది ఎక్కడ దొరుకుతుందో ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే తెలుసు. ప్చ్!)
అంతకు ముందు పార్లమెంట్ వెనుక బెంచీలలో కూర్చొని కునుకు తీసేసే తమ యువరాజు ఇప్పుడు మోడీని చూసి సింహలా ఘర్జిస్తుంటే కాంగ్రెస్ జీవులన్నీ తెగ ముచ్చట పడిపోతున్నాయి. పనిలో పనిగా ఆయన చకచకా దేశమంతా పాదయాత్రలు చేసేస్తూ తను సంపాదించుకొన్న జ్ఞానాన్ని చాలా ఉదారంగా జనాలకి పంచి పెట్టేస్తున్నారు. ఆ అదృష్టం రేపు ఆంధ్రా జనాలకి దక్కబోతోంది. ఆయన అనంతపురం జిల్లాలో రేపు పాదయాత్ర చేయబోతున్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న కొందరు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ఆనక తనకి బాగా గ్రిప్ ఉన్న ‘భూసేకరణ చట్టం-సవరణలు-నష్టాలు’ అనే సబ్జెక్ట్ మీద అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చి రిటర్న్ ఫ్లయిట్ లో డిల్లీ వెళ్ళిపోతారుట!
ఇంతవరకు అంతా క్లియర్ గానే ఉంది కానీ, దారిలో ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి దండేసే కార్యక్రమం ఒకటి పెట్టుకోవడంతో జనాలలో కొంచెం కన్ఫ్యుజన్ ఏర్పడింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డిని వైకాపా స్వంతం చేసుకొన్నాక, ఆయన విగ్రహానికి కాబోయే కాంగ్రెస్ మహారాజు దండేయడం ఏమిటి? అని జనాలు కూడా తికమక పడుతున్నారు. ఆయన దండేస్తారని తెలిసి వైకాపా కూడా బాగా హర్ట్ అయినట్లుంది. ఎన్నడూ కాంగ్రెస్ జోలికి వెళ్ళని వైకాపా నేతలు “ఆయన పేరుని యఫ్.ఐ.ఆర్.లో చేర్చి, ఆయన ఫ్యామిలిని అన్యాయంగా కోర్టులకీడ్చి ఇప్పడు ఏ మొహం పెట్టుకొని ఆయన విగ్రహానికి దండేస్తున్నారు?” అని డైరెక్టుగానే కడిగేశారు.
కానీ ఆయన విగ్రహం దారిలో కనబడింది కనుక ఏదో ఫార్మాలిటీ కోసం ఓ దండేసి దణ్ణం పెట్టి వెళ్ళిపోవాలనుకొంటున్నారా? లేక మాలాగే మీరు కూడా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొంటున్నట్లుగా మళ్ళీ మా వైయస్స్ పేరు చెప్పుకొని రాష్ట్రంలో చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోయాలనుకొంటున్నారా? అసలు మా దివంగత నేత విగ్రహానికి మీవోడు దండేయడంలో అర్ధం, పరమార్ధం ఏమిటి? అనే డౌట్ బయట పెట్టలేదు. కానీ మనసులో అటువంటిదే ఏదో డౌట్ వచ్చే ఉంటుంది కనుకనే వైకాపా నేతలు అబ్జెక్షన్ చెపుతున్నట్లున్నారు.