ప్రచారార్భాటాలు ఎంతచేసినా ప్రజలలో భరోసా కలగడం లేదన్న వాస్తవాన్ని మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, బిజెపి,వైసీపీలు అంగీకరించక తప్పని పరిస్థితి ఎపిలో ఏర్పడుతున్నది. తెలియని అభద్రత వెన్నాడుతూనే వుంది. ఇందుకు స్పష్టమైన రాజకీయ కారణాలూ వున్నాయి. అందుకే కొయ్యగుర్రం మీద స్వారీలా చివరకు అంతా ప్రచార తతంగంగానే మిగిలిపోతున్నది.
ముందుగా చెప్పాలంటే సప్త రాష్ట్ర పథకం పేరిట అద్యక్షుడు అమిత్‌షా వేసిన వ్యూహంలో భాగంగా ఎపి తెలంగాణలలో బిజెపి హడావుడి పెరిగింది. కేంద్రంలో బిజెపి నాయకత్వాన గల ప్రభుత్వంలో టిడిపివున్నా రాష్ట్రంలో బిజెపి వున్నా ఉమ్మడి బాధ్యత వహించడమన్న ప్రసక్తి లేకుండా పోయింది. పరస్పరం ఆరోపణలు సంధించుకోవడం ఆ పైన అంతా సర్దుకుని గప్చిప్ అనుకోవడం రివాజుగా మారింది. ప్రత్యేక హౌదా, ఆర్థిక సహాయం, విభజన సమస్యల పరిష్కారం వంటి విషయాల్లో కేంద్రం సహకారం నామమాత్రంగా వుంది. విభజనను పూర్తిగా బలపర్చిన బిజెపి ఆ సమయంలో విభజిత రాష్ట్రానికి ఇచ్చిన వాగ్డానాల్లో దేన్నీ ఇంతవరకూ పూర్తిగా నెరవేర్చింది లేదు. అయినా సరే రాష్ట్రంలో రాజకీయ శూన్యత లాభిస్తుందని ఆ పార్టీ ఆశపడుతున్నది.కానితాము నిజంగా చేసిందేమిటి చేస్తున్నదేమిటనే కనీస జవాబుదారి తనం మాత్రం లేదు. శూన్యత వచ్చిందంటే అది అధికారంలో వున్నవారి నిర్వాకాల వల్లనే వస్తుంది.వారిపై అసంతృప్తితోనే వస్తుంది. మరలాటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వున్న పార్టీ దాన్ని సానుకూల పరిణామంగా ఎలా చూస్తుంది? పైగా ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్‌కు పెద్దగా అలవాటు లేని మతతత్వ రాజకీయాలను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల విజయవాడలో పుష్కర పనుల కోసం విగ్రహాలు ఆలయాలను తరలించడంపై వివాదం రేపడం అందులో భాగమే అనుకోవాలి. ప్రభుత్వాధికారులు మంత్రులు కూడా మరింత జాగ్రత్త తీసుకుని వుండాల్సిందనడంలో సందేహం లేదు గాని దాన్ని హిందూమతంపై దాడిలాగా చిత్రించి ప్రయోజనం పొందాలనుకోవడం అనుమతించరానిది. పైగా బిజెపి వారే రెండు గొంతులతో మాట్లాడ్డం సంఘ పరివార్‌కు బాగా అలవాటైన కపటనీతికి అద్దం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు రాజధాని గుట్టుమట్టులు తమకు ఏదైనా తెలిస్తే ప్రజలముందుంచి సరిచేయాలి. అంతేగాని పైపైన విమర్శలు లోలోన కలయికల ప్రహసనం ప్రజలు హర్షించరు. వైఎస్ఆర్పార్టీ అద్యక్షుడు జగన్ విషయంలోనూ ి ఇటీవల హఠాత్తుగా ఎటాచ్మెంట్లు ప్రకటించడం, ఇద్దరు ఐఎఎస్‌ల విచారణకు అనుమతినివ్వడం చూస్తుంటే బిజెపి వైసీపీ పట్ల వైఖరి మార్చుకుందనే అర్థమవుతుంది. స్వాభావికంగానూ ఆ రెండు పార్టీల వెనక వున్న సామాజిక తరగతుల నేపథ్యాన్ని బట్టి వారి కలయిక సాధ్యపడేది కాదు. జగన్ పార్టీ వున్నా రాజకీయ శూన్యత గురించి మాట్లాడ్డంలో బిజెపి ఉద్దేశం తాము దాన్ని భర్తీచేసే ప్రధాన శక్తిగా వస్తామని సంకేతమివ్వడమే. శూన్యత ఏ మేరకు వుందనేది ఒకటైతే దాన్ని భర్తీ చేసే యోగ్యత, సంభావ్యత తమకు ఏ మాత్రం వున్నాయని ఆలోచించుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హర్యానా మహారాష్ట్రల ఉదాహరణ చెబుతున్న బిజెపి నేతలు అక్కడ 2014 పార్లమెంటు ఎన్నికల నాటికన్నా తర్వాత తమకు కొంత సీట్ల ఓట్ల సంఖ్య తగ్గిందని గుర్తుంచుకోవాలి. కాగా 2014లోనే ఎపిలో తెలుగుదేశం పొత్తు వుండి కూడా నాలుగు సీట్లతో సరిపెట్టిన పార్టీ ఒక్కసారిగా పెరిగిశూన్యాన్ని భర్తీ చేయాలనుకోవడం అత్యాశే అవుతుంది.
వైసీపీ అధినేత తమ గత బలం అలాగే వుందని, వచ్చేసారి తామే అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్నారు. సామూహిక ఫిరాయింపులు, వెనక్కుపోయాయనుకున్న జగన్ కేసుల్లో తీవ్ర చర్యలు పున:ప్రారంభం కావడం నేతల్లోనూ శ్రేణుల్లోనూ ఒకింత అభద్రత కలిగించిన మాట నిజమే. దాన్ని పోగొట్టడానికి కాదంటే ఆత్మ విశ్వ్ణాసం నిలబెట్టడానికి అధినేత కొన్ని కార్యక్రమాలు ప్రకటించినా కొద్దిమంది నేతలు తప్ప భారీ ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి కనిపించదు. బలవంతపు భూసేకరణ, ఇతర ప్రజాసమస్యలపై విమర్శలు నిరాహారదీక్షల వంటివి చేయడం తప్ప నిరంతరంగా పోరాడటం సమరశీల ప్రజా ఉద్యమాలు నిర్మించడం వైసీపీ ఎజెండాలో వుండదు. ఎందుకంటే ఆర్థిక విధానాలకు సంబందించి వైఎస్ వారసత్వం గాని ఇప్పుడు వారి ఆలోచనలు గాని అందుకు భిన్నంగా వుండవు, కార్పొరేట్ సంబంధాలు సారథ్యాలు కూడా తక్కువేమీ కాదు..ఇప్పటికి వైసీపీ ఒక ప్రధాన శక్తిగా వున్నా గత ఎన్నికల నాటితో పోలిస్తే అదనంగా ఏమైనా చేర్చుకోగలిగిందా అంటే అలాటి పరిస్థితి లేదు. అయినా సరే శూన్యత ఎంతమాత్రం లేదనీ, తామే గద్దెక్కబోతున్నామని చెప్పడమే గాక నిజంగా నమ్ముతున్నట్టు కనిపిస్తుంది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రతికూల పరిస్థితుల్లో అభివృద్ది కోసం ఏదో చేస్తున్నామనే ప్రచారం చేసుకుంటున్నా – అసంతృప్తి అస్పష్టత అంతకంటే తీవ్రంగానే వున్నాయి. ఆ పార్టీ నిర్వహించినట్టు చెబుతున్న సర్వేలోనే 40 శాతం ఎంఎల్ఎలపై సంతృప్తి లేదని వెల్లడైంది. మంత్రుల ర్యాంకులలోనూ ఇలాటి అంచనాలే చెప్పారు. అసలు స్వయానా ముఖ్యమంత్రి రోజూ అధికారులపై నేతలపై ఆగ్రహిస్తుంటారు. అమరావతి ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చెప్పినా వాణిజ్య వెంచర్లా మారిపోవడం కనిపిస్తూనే వుంది. అక్కడ ప్టాట్ల పంపిణీ ప్రక్రియకూడా నత్తనడక అనుమానాల పుట్టగా సాగుతున్నది. మరీ చంద్రబాబు వీరాభిమానులను మినహాయిస్తే మిగిలిన గ్రామీణులలో మరీ ముఖ్యంగా పేద రైతులలో ఏం జరగబోతున్నదనే సందేహాలు కొనసాగుతున్నాయి. పారదర్శకత మాటే లేదు. కంద్రం నుంచి నిధులు రాబట్టడంలోనూ తెలంగాణతో వివాదాల పరిష్కారంలోనూ పురోగమనం లేదు. పాలక పక్షీయులపై ఆరోపణలు ఎన్ని వచ్చినా సమర్థించడం తప్ప సరిదిద్దడం లేదు.కాల్‌మనీ వ్యవహారం ఇసుక కుంభకోణంవంటి వాటి నుంచి ఇప్పుడు సదావర్తి భూముల అమ్మకం వరకూ అన్నిచోట్లా జరిగిన వాటిని మాఫీ చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు. . ఫిరాయింపు దారులను మూకుమ్మడిగా చేర్చుకున్న కారణంగా పాలకపక్ష ప్రతినిధులలోనూ భవిష్యత్తు గురించిన గుబులు బయిలుదేరింది. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్‌ల నిర్ణయాలను గమనిస్తూ అనుసరించడం తప్ప తమ పాత్ర పెద్దగా వుండబోదనే వాస్తవం చాలామందిలో నిర్లిప్తత పెంచుతున్నది.
కనుక రాష్ట్రంలో రాజకీయ శూన్యత వుందని బిజెపి అన్నా మేమే వస్తామని తెలుగుదేశం భావించినా మాకే తదుపరి అవకాశం తప్ప మరే శూన్యత లేదని వైసీపీ అనుకున్నా అవన్నీకూడా అసమగ్ర భావనలే. విభజన తర్వాత ఎపి ప్రజలు ఇప్పుడిప్పుడే కుదుటపడి సింహావసలోకనం చేసుకుంటున్నారు. ప్రజాపక్ష రాజకీయాలు నైతికత సంరక్షణ ధనాడ్య వర్గాల ప్రాబల్యాలకు అడ్డుకట్ట అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరగాలనే కాంక్ష బలంగా వుంది.