వైకాపా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చిత్తూరు జిల్లా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన చిత్తూరు జిల్లా సబ్-కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసినందుకు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకి రెండువారాల రిమాండ్ విధించింది. అయితే ఆయన బెయిల్ సంపాదించుకొని శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
ఆయన విడుదలయ్యి వస్తునందుకు ఆయన అనుచరులు స్వీట్లు పంచుకొన్నారు. చెవిరెడ్డి బయటకి రాగానే ఆయనకీ స్వీటు తినిపించారు. కానీ పోలీసులు వారందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనని జైలు లోపల నుంచి బయటకి తీసుకువచ్చిన పోలీసులే ఆయనని వేరే కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి జైల్లోకి తీసుకుపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనుచరులు కూడా షాక్ అయిపోయారు. ఈసారి కూడా అదే సంఘటనపై అరెస్ట్ చేశారు కాకపోతే ఈసారి కారణం వేరే చెప్పారు. ఇంతకు ముందు సబ్-కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసినందుకు అరెస్ట్ చేస్తే, ఈసారి కలెక్టర్ కార్యాలయం గేట్లు త్రోసుకొని బలవంతంగా లోపలకి ప్రవేశించడానికి ప్రయత్నించి పోలీసులు విధులు నిర్వహించడానికి ఆటంకం కలిగించినందుకు సెక్షన్స్: 147,341,448 క్రింద అరెస్ట్ చేశారు.
ఇది కక్ష సాధింపు చర్య అని అర్ధమవుతూనే ఉంది. ఆయనని మళ్ళీ ఆవిధంగా, ఆ కారణంతో అరెస్ట్ చేసినందుకు వైకాపా నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడటం ఖాయం. ప్రభుత్వం కూడా తనకి నచ్చని లేదా లొంగని ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఈవిధంగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడటం సబబేనా? ఇటువంటి పనులు చేస్తే ప్రజలు తమ ప్రభుత్వం, పార్టీ గురించి ఏమనుకొంటారు? అని ఆలోచించడం మంచిది. ఒకవేళ కలెక్టర్ కార్యాలయం ముందు ఒక ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేయడమే నేరమయితే, తునిలో పోలీస్ వాహనాలని, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని తగులపెట్టినవారిని ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది?