తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వీర విధేయుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీ పదవిని పొందాడు.. పార్టీ తరపున ఎన్టీఆర్ భవన్ లో తరచూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడుతుంటారీయన. అలాగే తీవ్రమైన విమర్శలు చేయడం.. జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం గాలి ముద్దుకృష్ణమ నాయుడి శైలి. జగన్ మీద దుమ్మెత్తిపోయడంలో గాలిది అందె వేసిన చెయ్యి. అంతేకాదు.. చంద్రబాబునాయుడిని ప్రశంసించడంలో కూడా గాలికి మంచి ప్రవేశం ఉంది.
అయితే.. ఈ పొగడ్తల వర్షం కురిపించడంలో తాజాగా కొంచెం శ్రుతి మించారు ముద్దుకృష్ణమ. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీరో మార్కులు పడతాయని జగన్ చేసిన వ్యాఖ్యానాలపై గాలి స్పందిస్తూ.. చంద్రబాబుకు వందకు వంద మార్కులు పడతాయని, ఆయన నంబర్ వన్ అని ముద్దుకృష్ణమ అన్నారు. మరి ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలంటూ కొన్ని విషయాల గురించి ముద్దు ఏకరువు పెట్టారు. అందులో ఒకటి.. రూ.36 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేశామనేది!
ఈ హామీని ఎన్నికల ముందు అయితే ఇచ్చారు కానీ… అమల్లో మాత్రం ఇది జరగలేదు. ఈ విషయం ఏ డ్వాక్రా మహిళను కదిల్చినా స్పష్టం అవుతుంది. ఆఖరికి తెలుగుదేశం నేతలు కూడా అధికారికంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. డ్వాక్రా రుణమాఫీకి బదులుగా.. అని ఒక్కో మహిళ ఖాతాలో పది వేల రూపాయలు జమ చేస్తున్నామని బాబు ప్రభుత్వం కొన్నాళ్ల కిందట ప్రకటించింది. అయితే మొత్తాన్ని కూడా మహిళలు ఒకేసారి డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. మరోవైపు రుణమాఫీపై ఆశలతో డ్వాక్రా మహిళలు లోన్లను సరిగా కట్టక.. మొత్తం డ్వాక్రా వ్యవస్థకు, బ్యాంకులకు సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో డ్వాక్రా రుణమాఫీ చేశామని గాలి ముద్దుకృష్ణమ చెప్పడం హాస్యాస్పదం. ప్రభుత్వమే చేయలేదని అంటుంటే.. గాలిగారు ఇలా ఎలా చెబుతారో!