ఎన్ని మార్కులొచ్చాయ్. ఎంత ర్యాంకొచ్చింది. భారత దేశంలో బడికెళ్లే పిల్లలు తరచూ ఎదుర్కొనే ప్రశ్నలివి. అప్పుడెప్పుడో బడిలో ఆటల పీరియడ్ ఉండేది. ఇప్పుడదీ మాయమైంది. మెలకువగా ఉన్నంత సేపూ చదువు, హోం వర్క్. దీనికి భిన్నంగా క్రీడా రంగాన్ని ఎంచుకున్న సింధు యావత్ దేశానికి గర్వకారణంగా మారింది. ఇంతకీ, సింధు క్లాస్ లో టాపర్ గా నిలిచిన అమ్మాయి ఎవరో ఎంత మందికి తెలుసు?
ఆటలు తిండి పెడతాయా. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు అనే మాటిది. ఆడటం అంటే పనికి మాలిన పని అని వాళ్ల నమ్మకం. చదువులో బాగా మార్కులు వస్తేనే మంచి జీవితం ఉంటుందని అనుకుంటారు. చదువులోనూ పిల్లలకు స్వేచ్ఛనివ్వరు. ఏ కోర్సు చదవాలి, ఏ కాలేజీలో చేరాలి అనేది అమ్మా నాన్న నిర్ణయిస్తారు. పిల్లలపై ఒత్తిడి పెంచుతారు.
పీవీ సింధు అదృష్టవంతురాలు. ఆమెకు ఆ ఒత్తిడి లేదు. తల్లిదండ్రులు క్రీడాకారులే కాబట్టి కూతురికి స్వేచ్ఛనిచ్చారు. కోరుకున్న ఆటలో కోచింగ్ ఇప్పించారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ యాన్స్ బాలికల జూనియర్ రాలేజీలో సింధు చదివింది. ఇంటర్లో 68 శాతం మార్కులతో పాసైంది. అదే కాలేజీలో డిగ్రీ చదివింది. 62 శాతం మార్కులు తెచ్చుకుంది. వేరే పిల్లల తల్లిదండ్రులైతే గయ్యిమనే వాళ్లు. 90 శాతం తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించేవారు.
సింధు కాలేజీలో టాపర్ కాదు. ఆమె కంటే ఎక్కువ మార్కులతో పాసైన అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. ఇంటర్లో, డిగ్రీలో సింధు కంటే మెరుగ్గా, టాప్ ర్యాంక్ సాధించిన అమ్మాయి ఎవరో ఎంత మందికి తెలుసు? చదువులో టాపర్ కాని సింధు పేరిప్పుడు దేశమంతా మార్మోగుతోంది. ఒలింపిక్స్ లో తొలి రజత పతకం సాధించిన భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
సింధు విజయానికి ఆసేతు హిమాచలం పొంగిపోతోంది. నజరానాల వర్షం కురుస్తోంది. కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటనలు వెలువడుతున్నాయి. కాలేజీలో సింధు బ్యాచ్ లో టాపర్ గా నిలిచిన అమ్మాయి, ఆ మార్కులతో ఏదో ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ఆమె ఎన్నేళ్లు ఉద్యోగం చేస్తే ఇప్పుడు సింధుకు వచేటన్ని కోట్ల రూపాయలు ఆర్జించ గలదు?
చదువు అవసరం లేదని కాదు. కానీ అందరూ చదువే ముఖ్యం అనుకోరనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. విద్యార్థి ప్రతిభకు మార్కులే కొలమానం కాదు. చదువులో కాకపోతే మరో రంగంలో రాణిస్తారు. రియోలో కాంస్య పతకం సాధించిన హర్యానా అమ్మాయి సాక్షి మాలిక్ అయితే తల్లిదండ్రులను ఎదిరించి మరీ ప్రాక్టిస్ చేసేది. ఇప్పుడు తల్లిదండ్రులు ఆమెను చూసి గర్వపడుతున్నారు. పిల్లలను చదువుపేరుతో ఒత్తిడికి గురి చేయవద్దన్న పెద్దల మాటే కరెక్టని సింధు, సాక్షిల విజయం మరోసారి రుజువు చేసింది.