ఒక్క సినిమాతో అందరినీ తన వైపుకి తిప్పుకొన్నాడు తరుణ్ భాస్కర్. కేవలం అరవై లక్షల బడ్జెట్‌తో పెళ్లి చూపులు సినిమా తీసి… దాదాపు రూ.10 కోట్లు రాబట్టి నివ్వెరపరిచాడు. ఓ కొత్త దర్శకుడు హిట్ కొడితే, అదీ ఈ రేంజు కమర్షియల్ సక్సెస్ ఇస్తే.. ఇక చెప్పేదేముంది? ఇప్పటికే తరుణ్ భాస్కర్ చేతులు అడ్వాన్స్ చెక్కులతో నిండిపోయాయి. అయితే రెండో సినిమా విషయంలో ఇప్పటికీ క్లారిటీకి రాలేదు తరుణ్. ఎవరితో చేయాలి, ఎలాంటి కథని ఎంచుకోవాలి అనే దానిపై ఇప్పడిప్పుడే ఫోకస్ పెడుతున్నాడు. అందులో భాగంగా తన షార్ట్ ఫిల్మ్ ‘సైన్మా’ని బయటకు తీశాడు. తెలంగాణ మాండలికంలో సరదాగా సాగిపోయే ప్రేమకథ సైన్మా. తన ప్రేమని గెలిపించుకోవడం కోసం ఓ ప్రియుడు పడే తాపత్రయం ఈ షార్ట్ ఫిల్మ్.
ఇందులో కథ, కథనం కంటే పాత్రల ప్రవర్తన, వాళ్లు మాట్లాడే సహజసిద్ధమైన భాష.. యూట్యూబ్ ప్రేక్షకులకి బాగా నచ్చాయి. దాంతో హిట్లు పడ్డాయి. తరుణ్ భాస్కర్ దర్శకుడు కావడానికి, అతనికి దర్శకుడిగా తొలి అవకాశం అందడానికి ఈ సైన్మా షార్ట్ ఫిల్మ్సే కారణం. ఇప్పుడు ఆ కథనే సినిమాగా మారుద్దామనుకొంటున్నాడ తరుణ్ భాస్కర్. తను తన రెండో సినిమాని సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయాల్సివుంది. హీరో ఎవరనేది ఇంకా షైనలైజ్ కాలేదు. సైన్మాని సినిమాగా మలిస్తే బాగుంటుందన్న ఆలోచన సురేష్ బాబునే ఇచ్చాడట. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ అదే పనిలో ఉన్నాడని సమాచారం. సో.. షార్ట్ ఫిల్మ్ సినిమాగా మారబోతోందన్నమాట.