కృష్ణా పుష్కరాలు రేపటితో పూర్తవుతాయి. ఇంతవరకు నిర్విఘ్నంగా సాగాయి. ఏపిలో పుష్కరాలకి వచ్చిన భక్తులు అందరూ ఈసారి ఏర్పాట్లు చాలా బాగా చేశారని మెచ్చుకొంటున్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే భక్తులు ప్రభుత్వాన్ని గాక చంద్రబాబే ఈ ఏర్పాట్లన్నీ అద్భుతంగా చేశారని చెపుతున్నారు కనుక! ఆ పొగడ్త లేదా మెప్పు కోసమే ఆయన అంతా తానై పుష్కరాలు నిర్వహించారు. కనుక ఊహించినట్లుగానే ఆ క్రెడిట్ అయనకే దక్కుతోంది. అందుకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులు, సిబ్బంది, పోలీసులకి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన ఈ రెండు రోజులు కూడా అందరూ పూర్తి అప్రమత్తంగా మెలగాలని సూచించారు. కృష్ణా పుష్కరాలని సమర్ధంగా నిర్వహించడం వలన ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ పుష్కరాల గురించి దుష్ప్రచారం చేయాలనుకొన్న వారి నోళ్ళు మూతపడేలాగ అందరూ కలిసి చాలా అద్భుతంగా పుష్కరాలని నిర్వహించారని అధికారులని, సిబ్బందిని మెచ్చుకోవడం ద్వారా సాక్షి, వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చురకలు వేశారు.
ఈసారి పుష్కరాల కోసం తెలంగాణాతో పోలిస్తే ఆంధ్రాలో నభూతో నభవిష్యత్ అన్నట్లుగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారనే మాట వాస్తవం. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అధికారులు, సిబ్బంది, వివిధ స్వచ్చంద సంస్థలని మనస్ఫూర్తిగా అభినందించడం న్యాయం. తెలంగాణా ప్రభుత్వం కూడా కృష్ణా పుష్కరాలు నిర్వహించింది. అది కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, పుష్కరాల నిర్వహణ బాధ్యతని తన మంత్రులు, ఉన్నతాధికారులకే వదిలిపెట్టి పైనుంచి పర్యవేక్షణకే పరిమితం అయ్యారు. కనుక అక్కడ పుష్కరాలకి వచ్చిన భక్తులు ‘ప్రభుత్వం’ చాలా బాగా ఏర్పాట్లు చేసిందని మెచ్చుకొంటున్నారు. ఆ క్రెడిట్ ని కెసిఆర్ అందరితో కలిసి పంచుకొంటుంటే, చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ పూర్తిగా తనే స్వంతం చేసుకొంటున్నారు. పుష్కరాలు సజావుగా నిర్వహిస్తున్నందుకు ఆయన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొంటునప్పటికీ క్రెడిట్ మాత్రం ఆయన స్వంత ఖాతాలోనే జమా అయినట్లు చెప్పవచ్చు. ఈ ఒక్క తేడా తప్ప కృష్ణా పుష్కరాలు రెండు రాష్ట్రాలలో చాలా సజావుగానే సాగిపోతున్నాయి.