హ్యాపీడేస్ సినిమాతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకొచ్చాడు వరుణ్ సందేశ్. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో కుర్రకారులో వరుణ్ పేరు మార్మోగిపోయింది. కొత్త బంగారు లోకం కూడా బాగా ఆడడంతో యూత్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలతో రెండేళ్ల పాటు అతని ప్రయాణం బిజీ బిజీగానే సాగింది. హిట్లు కొట్టకపోయినా అవకాశాలకు ఢోకా లేకుండా పోయింది. అయితే.. ఆ తరవాత ఆ జోష్ పూర్తిగా కనుమరుగైంది. వరుస ఫ్లాపులతో వరుణ్ పేరు మర్చిపోయారు కూడా. పట్టాలెక్కిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. యూత్ హీరోలు నాని, శర్వానంద్, సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడంతో వరుణ్ మరీ డల్ అయిపోయాడు. కొన్నాళ్ల నుంచి ఎక్కడా కనిపించడం లేదు కూడా. ఇటీవలే వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.
ఆ హ్యాపీ మూడ్లో ఉండగానే వరుణ్ నటించిన మిస్టర్ 420 విడుదలకు సిద్ధమైంది. ఈనెలాఖరున పాటల్ని, వచ్చే నెలలో సినిమానీ విడుదల చేస్తారట. రెండేళ్ల క్రితం మొదలైన సినిమా ఇది. ఇప్పటికి మోక్షం దొరికింది. ”ఇటీవలే వరుణ్ పెళ్లయ్యింది. పెళ్లయ్యాక లక్ మారుతుంది. చాలామంది హీరోలు అలానే హిట్లు కొట్లారు. వరుణ్ కూడా హిట్ కొడతాడ”ని చిత్రబృందం సెంటిమెంట్ కురిపిస్తోంది. ఆసెంటిమెంట్ వర్కవుట్ అయితే… బాగానే ఉంటుంది మరి.