మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు నిన్న అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాకి తగినంత సాగునీటి సౌకర్యం లేకపోవడం చేత, ఆ సమస్యని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ గన్ లని రైతులకి అందజేసింది. వాటి పనితీరుని పరిశీలించేందుకే వారు నిన్న జిల్లాలో ధర్మవరం, చెన్నే కొత్తపల్లి, పెనుకొండ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈఏడాది తగినంత వానలు కురవకపోవడంతో ఆ రెయిన్ గన్ లు ఉపయోగపడలేదని వారు గ్రహించారు.
తీవ్ర నీటి ఎద్దడితో బాధపడుతున్న రాయలసీమ జిల్లాలకి త్రాగు, సాగు నీరు అందించడానికే తెదేపా ప్రభుత్వం చాలా ఆర్భాటంగా పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేశామని గొప్పలు చెప్పుకొంటోంది. ఈ సందర్భంగా మంత్రులు ఇద్దరూ దాని గురించి ఏమైనా మాట్లాడి ఉంటే బాగుండేది. లేదా జిల్లాకి సాగు, త్రాగు నీరు అందించడానికి తమ ప్రభుత్వం ఇంకా వేరే ఏమి చర్యలు చేపడుతోందో రైతులకి వివరించినా బాగుండేది. కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు అక్కడికి వెళ్ళినా వారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మరిచిపోలేదు.
పట్టిసీమ గురించి జగన్ వ్యక్తం చేస్తున్న అనుమానాలకి, చేస్తున్న విమర్శలకి వారు సమాధానం చెప్పినా సందర్భోచితంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి పవిత్రమైన పుష్కర స్నానాలు చేసినా ఆయన బుద్ధి మారలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఆందోళన చేస్తున్న జగన్, కాంగ్రెస్ నేతలకి రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఆరోజు అడ్డుగోలుగా రాష్ట్ర విభజన జరుగుతుంటే ప్రశ్నించని వారు ఇప్పుడు మోసలి కన్నీళ్లు కార్చుతున్నారని మంత్రులు విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో తెదేపా కూడా ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదనే సంగతి మంత్రులకి తెలియదనుకోలేము. ప్రత్యేక హోదా లేదా మరొకటో కావాలని డిమాండ్ చేస్తే రాష్ట్ర విభజనకి తెదేపా ఒప్పుకొన్నట్లే అవుతుంది కనుక అప్పుడు రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తు ఉద్యమిస్తున్న వైకాపాదే పైచెయ్యి అవుతుందనే భయంతోనే తెదేపా ఏపికి న్యాయంగా దక్కవలసిన వాటి గురించి నోరు విప్పి మాట్లాడకుండా ‘రెండు కళ్ళ సిద్దాంతం’ అమలుచేసింది. తద్వారా ఏపికి తీరని నష్టం కలిగింది. అందుకు మిగిలిన పార్టీలతో బాటు తెదేపా కూడా బాధ్యతా వహించకతప్పదు.
తెలంగాణాలో రాజకీయ పార్టీలన్నీ కలిసి ‘తెలంగాణా సాధన’ లక్ష్యంగా పోరాడి సాధించుకొంటే, ఏపిలో తెదేపా, వైకాపాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి ఎన్నికలే లక్ష్యంగా భూటకపు ఉద్యమాలు చేశాయి. ఒకపక్క శరవేగంగా రాష్ట్ర విభజన జరిగిపోతుంటే అప్పటికైనా మేల్కొని ధైర్యం చేసి రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటి కోసం గట్టిగా పోరాడకుండా ఆ రెండు పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలని, పార్టీ ప్రయోజనాలని మాత్రమే చూసుకొన్నాయి. కనుక రాష్ట్రానికి ఈ దుస్థితి కలగడానికి వాటినీ నిందించక తప్పదు. ప్రత్యేక హోదా విషయంలో కూడా తెదేపాతో సహా కాంగ్రెస్, వైకాపా, భాజపాలు నేటికీ అదేవిధంగా డ్రామాలు ఆడుతూ ప్రజలని మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక అందరూ ఆ తానులో ముక్కలేనని చెప్పక తప్పదు.