ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈరోజు మళ్ళీ మరో బహిరంగ లేఖ వ్రాసినట్లు తాజా సమాచారం. దానిలో కాపులకి రిజర్వేషన్ల గురించి ప్రస్తావించకుండా, తుని విధ్వంసం కేసులో అరెస్టుల గురించే ఎక్కువగా వ్రాసినట్లు తెలుస్తోంది. ఆ కేసులో ఎవరినైనా అరెస్టులు చేయదలిస్తే ఆ విషయం ముందుగా తనకి తెలియజేయవలసిందిగా కోరుతూ ముద్రగడ కొన్ని ఫోన్ నెంబర్లని ఇచ్చారు. తుని విద్వంసం కేసు పేరిట ప్రభుత్వం కాపులని సంఘ విద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు లేఖలో ముద్రగడ ఆరోపించారు. తామేమీ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని ఎగవేయలేదని, రాజధాని ప్రాంతంలో పరిశ్రమల స్థాపన పేరిట భూములు కాజేయలేదని, కనుక తాము ఎవరికీ భయపడవలసిన అసరంలేదని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకి భయపడవద్దని, అవసరమైతే జైలుకి వెళ్లేందుకు కూడా అందరూ సిద్దపడాలని కాపులని ముద్రగడ లేఖలో కోరినట్లు సమాచారం. తన జాతి కోసం ఎన్ని అవమానాలనైనా భరించడానికి తాను సిద్దంగా ఉన్నట్లు ముద్రగడ తెలిపారు.
ఆయన ఇదివరకు ఆమరణ నిరాహార దీక్ష విరమించినప్పుడు ఇకపై కాపు సంఘాల నేతలందరినీ కలుపుకొని సమిష్టిపోరాటం చేస్తామని చెప్పారు. కానీ ఈవిధంగా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు వ్రాస్తున్నారు. వాటికి కాపు సంఘాల నేతల ఆమోదం ఉందని భావించలేము. ముద్రగడ తన లేఖల్లో కాపులకి రిజర్వేషన్లు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఉండి ఉంటే ఎవరూ వేలెత్తి చూపేవారు కాదు. కానీ అయన తుని విధ్వంసం కేసు విచారణ గురించి వ్రాస్తున్నారు.
ఒకసారి ఆ కేసులో తననే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తారు. మరొకసారి దానికి తనకీ ఎటువంటి సంబంధం లేదని చెప్తారు. మళ్ళీ ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయదలచుకొన్నా ముందుగా తనకి తెలియజేయమని కోరుతున్నారు. ఒక సంఘవిద్రోహ చర్యలో నిందితులని ఆచూకి కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతుంటే దానికి ఆయన అభ్యంతరాలు తెలపడం, తన అనుమతి తీసుకోవాలని సూచించడం, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసే వరకు ఆమరణ నిరాహార దీక్షలు చేయడం, ఎవరిని అరెస్ట్ చేసినా దానిని కాపుల పోరాటంతో ముడిపెట్టి వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం వంటివన్నీ ఆయన కాపులకి ఏకైక ప్రతినిధిగా ఎదిగే ప్రయత్నంలో చేస్తున్నవిగానే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ఆయనకి రాజకీయాలలో ఇంకా ఆసక్తి ఉన్నట్లయితే, పార్టీ స్థాపించుకొనో లేదా తనకి నచ్చిన రాజకీయ పార్టీలో చేరో తన లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. ఒకవేళ కాపులకి రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యం అయితే దానికోసం ఇటువంటి లేఖలు వ్రాయనవసరం లేదు. ప్రభుత్వంతో ఘర్షణ పడవలసిన అవసరం అంతకంటే లేదు. కానీ అయన తన లేఖలో తామేమీ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని ఎగవేయలేదని, రాజధాని ప్రాంతంలో పరిశ్రమల స్థాపన పేరిట భూములు కాజేయలేదనడం తెదేపా మంత్రుల్ని ఉద్దేశ్యించి వ్రాసినదేనని అర్ధం అవుతూనే ఉంది. ఇవి తెదేపా ప్రభుత్వం పట్ల ఆయనకున్న వ్యతిరేకతకి అద్దం పడుతున్నాయి.
వచ్చే ఎన్నికలలో తెదేపాతో సహా అన్ని పార్టీలకి కాపుల ఓట్లు చాలా ముఖ్యమైనవే కనుక తెదేపా కూడా వారి ఆగ్రహానికి గురయ్యి వారిని దూరం చేసుకోవాలని కోరుకోదని ముద్రగడ పద్మనాభానికి తెలిసే ఉంటుందు. కనుక వైకాపా ప్రోద్బలంతో ఆయన కాపులని తెదేపాకి దూరం చేయడానికే ఈ పోరాటాన్ని మొదలుపెట్టి ఉండవచ్చని తెదేపా నేతలు అనుమానిస్తున్నారు. వారి అనుమానాలు నిజమేనన్నట్లుగా సాగుతోంది ఆయన వ్యవహార శైలి.
అయినా కాపులకి రిజర్వేషన్లు సమస్య అనేది ఆయన వ్యక్తిగత సమస్య కాదు. అది కాపులందరికీ సంబంధించిన సమస్య. కనుక కాపు నేతలందరినీ కలుపుకొనిపోవాలి. కానీ ఆవిధంగా చేయకుండా ఇటువంటి లేఖలు వ్రాస్తుండటం తనని తాను కాపుల నేతగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి లేదా తెదేపాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాజకీయంగా వ్యతిరేకిస్తున్న వైకాపా తరపున ఆయన మాట్లాడుతున్నట్లుగా అనుమానించవలసివస్తోంది. అయన ప్రధాన లక్ష్యం కాపులకి రిజర్వేషన్లు సాధించడమే అయితే కాపు సంఘాల నేతలతో కలిసి సమిష్టి నిర్ణయాలు, సమిష్టి పోరాటాలు చేయడం మంచిది. కానీ ఆ పేరుతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే రాష్ట్రంలో అశాంతి ఏర్పడుతుంది. దానిని ఎవరూ సమర్ధించరు.