ఓదార్పు, పరామర్శ అనే పదాలు వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే. ఎక్కడ ఏ ప్రమాదం జరిగి ఎవరు మరణించినా పోలీసులు, అధికారులు, అంబులెన్సులు అక్కడికి చేరుకోవడం ఆలశ్యం అవవచ్చునేమోగానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ వాలిపోతారంటే కొంచెం అతిశయోక్తిగా ఉన్నప్పటికీ ఆయన తప్పక పరమార్శిస్తారనేది నిజం. అందుకే అయన శవరాజకీయాలు చేస్తుంటారని తెదేపా నేతలు విమర్శిస్తుంటారు.
భాదితుల పట్ల నిజంగానే సానుభూతితోనే అక్కడికి వెళ్లి జగన్ వారికి సహాయపడితే అందరూ హర్షిస్తారు కానీ ఓదార్పు, పరామర్శ పేరుతో అక్కడికి వెళ్లి రాజకీయాలు మాట్లాడుతుంటారు. తిప్పితిప్పి దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అనో లేదా ఆయన ఇచ్చిన నష్ట పరిహారం చాలా లేదనో లేదా మరో వంకతోనో ఆయనపై విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు పరితపిస్తున్నట్లే, చంద్రబాబు నాయుడుని విమర్శించాలని జగన్ నిత్యం పరితపిస్తుంటారు. ఇద్దరూ ఆ బలహీనతని జయించలేకపోతున్నారు.
ఇక విషయంలోకి వస్తే, ఈరోజు తెల్లవారు జామున ఖమ్మంలో నాయకన్ గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కాకినాడకి చెందిన 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 18మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సంగతి తెలియగానే రాజకీయ నాయకులు ఒకరొకరు అక్కడ వాలిపోయి భాదితులని పరామర్శిస్తున్నారు.
అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ వాలిపోయి భాదితులని పరామర్శించిన తరువాత యధాప్రకారం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించి వెళ్ళిపోయారు.
ఆ ప్రాంతంలో తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలిసినా ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని తెరాస ప్రభుత్వాన్ని విమర్శించారు. గాయపడినవారిని మానవతా దృక్పధంతో ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారంలో తెదేపా నేతలే ఎక్కువగా ఉన్నారని కానీ వారిని చంద్రబాబు నాయుడు కట్టడి చేయలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప కోసం మృతుల కుటుంబాలకి రూ.5లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించేవారని ఇప్పుడు అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సులు ప్రైవేట్ వైనా ఆర్టీసికి చెందినవైనా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. అదే విధంగా బస్ ప్రయాణికులకి ఇన్స్యూరెన్స్ విధానం అమలుచేయాలని సూచించారు.