భారత్ అథ్లెట్ ఓపి జైన్ న్ని భారత్ తరపున మారథాన్ రేసులో పాల్గొనేందుకు రియో ఒలింపిక్స్ పంపారు. రియోకి పంపారని చెప్పడం కంటే మృత్యువు దగ్గరకి పంపారని చెప్పడం సబబుగా ఉంటుందేమో! ఆమె 42కిమీ మారథాన్ రేసులో పాల్గొన్నప్పుడు దారిలో ఎక్కడా భారత్ కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆమెకి త్రాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకలేదు.
అసలు ఆ స్టాల్స్ భారత్ అధికారులే లేరుట! రియోకి వెళ్ళిన భారత్ అధికారులు దరి పొడుగునా తమకి కేటాయించిన స్టాల్స్ లో తప్పనిసరిగా ఉండి ఆమెకి అత్యవసరమైన మంచినీళ్ళు, ఎనర్జీ డ్రింక్స్, అల్పాహారం అందించవలసి ఉంటుంది. కానీ 42 కిమీ మారథాన్ రేసులో ఎక్కడా కూడా త్రాగడానికి మంచి నీళ్ళు లేవు..స్టాల్స్ లో అధికారులు కూడా కనబడలేదని ఆమె తెలిపారు. మిగిలిన దేశాల అధికారులు తమ క్రీడాకారులకి అడుగడుగునా సపర్యలు చేస్తుంటే, మన అధికారులు ఎక్కడా కనబడకుండా మాయం అయిపోయారు. బహుశః శోభా డే చెప్పినట్లుగా ఆ సమయంలో వారందరూ రియోలో ఎంజాయ్ చేస్తున్నారేమో? ఆ రేసులో పాల్గొంటున్న క్రీడాకారులు వేరే దేశాలకి చెందిన స్టాల్స్ ఏమీ తీసుకోకూడదనే నిబంధన ఉన్నందున ఆమె అలాగే డీ హైడ్రేషన్ కి గురవుతూనే అతికష్టం మీద మారథాన్ పూర్తి చేసి స్పృహ తప్పి పడిపోయారు.
సుమారు 43డిగ్రీల ఉష్ణోగ్రతలో అరకిలోమీటరు కూడా నడవడానికి ఇబ్బంది పడతాము. అటువంటిది ఓపి జైన్ ఏకంగా 42కిమీ దూరం ఎక్కడా మంచినీళ్ళు త్రాగకుండా మారథాన్ పూర్తి చేసింది అంటే ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక తాను బ్రతకననే ఆమె అనుకొందిట! కానీ అదృష్టవశాత్తు ఆమె కోచ్ సకాలంలో ఆమెని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. లేకుంటే డీ హైడ్రేషన్ కారణంగా ఆమె చనిపోయి ఉండేదే! భారత అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమీ ఉండదు.
సాక్షి మాలిక్, పివి సింధు మెడల్స్ సాధించినందుకు అందరూ పొంగిపోతున్నాము. ప్రభుత్వాలన్నీ పోటీలుపడి వారికి బహుమానాలు ప్రకటిస్తున్నాయి. కానీ అధికారులలో ఇంత నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం నెలకొని ఉన్నప్పుడు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా దేశంలో క్రీడారంగం ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది. క్రీడాకారులు ఏవిధంగా మెడల్స్ సాధిస్తారు? బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన అధికారులని ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది?