ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లో పనిచేస్తున్న తన ఉద్యోగులను, కార్యాలయాలను విజయవాడకు తరలించాలనుకొంటోంది. అంచెలంచెలుగా ఉద్యోగులను కార్యాలయాలను అన్నీ ఒకేసారి విజయవాడకి తరలించాలని భావిస్తుండటంతో ఒకేసారి అన్నివేళ మంది ఉద్యోగులకి వసతి, కార్యాలయాల ఏర్పాటుకి అవసరమయిన భవన సముదాయాల కోసం వెతుకులాట సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు చేయడం కోసం గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నిటినీ ఉపయోగించుకొన్నా ఇంకా చాలా భవనాలు అవసరం ఉంది. ఇక వేలమంది ఉద్యోగులకు నివాసాలను ఏర్పాటు చేయడం ఇంకా పెద్ద సమస్య. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు పక్కన పడేసిన తాత్కాలిక రాజధాని నిర్మాణం ప్రతిపాదనను మళ్ళీ అమలుచేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. అందుకోసం విజయవాడ-గుంటూరు పట్టణాల మధ్యన హైవేకి దగ్గరలో హరిహాంత్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 23ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు బదులుగా ఆ సంస్థకు నవులూరు వద్ద స్థలం కేటాయిస్తోంది. ఆ సంస్థ నుంచి స్వాధీనం చేసుకొన్న ఆ ప్రాంతంలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయబోతోంది.
ఇంతకు ముందు హైదరాబాద్ నుండి అమరావతికి ప్రభుత్వ ఉద్యోగులను, కార్యాలయాలను తరలించాలని భావించినప్పుడు అందుకోసం ప్రీ-ఫ్యాబ్రికేటడ్-పద్దతిలో తాత్కాలిక నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. దానికోసం సుమారు మూడు వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అది చూసి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. హైదరాబాద్ లో మరో తొమ్మిదేళ్ళు ఉండేందుకు అవకాశం ఉంది. పైగా ఉద్యోగులు కూడా విజయవాడకి తరలి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. మరొక రెండేళ్ళలో శాశ్విత రాజధానిలో భవనాలు సిద్ధమయ్యే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ వందల కోట్లు ఖర్చు చేయడం, శాశ్విత రాజధాని ఏర్పడిన తరువాత వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ భవనాలన్నిటినీ మళ్ళీ తొలగించడానికి భారీగా ఖర్చవుతుంది. తొలగించకపోతే అవి నిరుపయోగంగా మారుతాయి. అందుకే ప్రభుత్వం ఆ ప్రతిపాదనని పక్కన పడేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు అంత కాకపోయినా ఎంతో కొంత ఖర్చు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఆ 23ఎకరాల స్థలంలో తాత్కాలిక రాజధాని నిర్మించడానికి సిద్దం అవుతున్నట్లుంది. మరి దానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయబోతోందో? చూడాలి.
ఫోన్ ట్యాపింగ్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా హైదరాబాద్ లోనే ఉంటే ఎన్ని సమస్యలు వస్తాయో…అనే భయంతోనే ఇంత హడావుడిగా విజయవాడకు తరలిపోవాలనుకొంటున్నరేమో? ఉద్యోగులు వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం ఇప్పుడు వారానికి ఐదురోజులు విజయవాడలోనే గడుపుతున్నారు. ఇంతకు ముందు ఆంద్రప్రదేశ్ ప్రజలు ఎంతగా బ్రతిమాలినా రాష్ట్రానికి రాని ప్రభుత్వం కేసీఆర్ కొట్టిన దెబ్బకి ఒకేసారి తరలివచ్చేస్తున్నట్లుంది.