రాజధాని నిర్మాణం కోసం తమ పంట భూములను ఇవ్వడానికి అయిష్టత చూపుతున్న ఉండవల్లి, పెనుమాక. బేతపూడి తదితర గ్రామాల రైతులపై ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకోవాలనుకొంటోంది. ఈ బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలో సీ.ఆర్.డి.ఏ. కార్యాలయం సమీపంలో లెనిన్ సెంటర్ వద్ద ఈరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ధర్నా చేయబోతున్నారు. ఈ ధర్నాలో రైతులు, వైకాపా నేతలు, కార్యకర్తలు, భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొంటాయి.
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 33, 000 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, ఉండవల్లి తదితర గ్రామాలకు చెందిన 2,700 ఎకరాలను కూడా భూసేకరణ చట్టం ప్రయోగించి స్వాధీనం చేసుకొనేందుకు సిద్దమవుతోంది. ఇటీవల ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాలలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బలవంతపు భూసేకరణపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకే మొగ్గు చూపుతోంది. ఆ భూములు స్వాధీనం చేసుకోకపోతే రాజధాని నిర్మాణం చేప్పట్టలేమని వాదిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఆ భూములను స్వాధీనం చేసుకొని తీరుతామని ప్రభుత్వం విస్పష్టంగా చెప్పడంతో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసనగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ధర్నా చేపడుతున్నారు. రైతులను కాపాడాల్సిన ప్రభుత్వమే వారి భూములను బలవంతంగా గుంజుకోవాలనుకోవడం కంచే చేనుని మేసినట్లుందని ఆయన అన్నారు. ఈ ధర్నా కోసం మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.