హటాత్తుగా ధరలు ఆకాశానికి ఎగబాకుతాయి. ఉన్నపళంగా పాతాళానికి పడిపోతాయి. లక్షల కోట్లు లాభాలొస్తాయి లేదా నష్టాలను మోసుకొస్తాయి. ఎందుకో తెలియదు. ఎనలిస్టులు ఏవో కారణాలు చెప్తారు. అవి సామాన్యుడికి అర్థం కావు. అర్థమయ్యే లోపల మరో సారి కలకలం చెలరేగుతుంది. సోమ, మంగళవారాల్లో పరిస్థితిని చూస్తే స్టాక్ మార్కెట్ ఎంత అనిశ్చితికి నెలవో అర్థమవుతుంది. సోమవారం బ్లాక్ మండే అన్నారు. 7 లక్షల కోట్ల సంపద ఆవిరైందన్నారు. చైనా మార్కెట్ దెబ్బ మనకు గట్టిగా తగిలిందన్నారు. ఆసియాతో పాటు ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం పడిందన్నారు. దేశమంతటా హాహాకారాలు. షేర్లు కొనే అలవాటున్న ప్రతి ఒక్కరూ టెన్షన్ పడ్డారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేది ఎలాగా అని ఆందోళన చెందారు.
మంగళవారం అనూహ్యంగా మార్కెట్ పుంజుకుంది. అంతో ఇంతో పాజిటివ్ గానే ముగిసింది. మరి సోమ, మంగళవారం మధ్య ఏం జరిగింది? ఏం మారింది? ఏమీ మారలేదు. చైనా తయారీ రంగం పరుగులు పెట్టలేదు. చైనా వృద్ధి రేటు అమాంతం పెరగలేదు. చైనా ఆర్థిక రంగం ఒక్కసారిగా బుల్ రంకెలు వేయలేదు. చైనా ఎఫ్పట్లాగే ఉంది. దాని పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. మరి మన మార్కెట్లు ఎందుకు కోలుకున్నాయి? సోమవారం నాటి పతనానికి చైనా కారణమని ఎనలిస్టులు టీవీల్లో చెప్పారు. మరి మంగళవారం నాటి రికవరీకి ఏమి కారణం?
స్టాక్ మార్కెట్ అంటే దైవాధీనం అంటారు వ్యతిరేకులు. కాదు, అది ఎంతో తెలివిగా చేసే వ్యాపారం అంటారు మదుపుదారులు. ఈ రెండు రకాల వాదనలు చాలా కాలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ వ్యాపారం అద్భుతం అంటూ వారెన్ బఫెట్ లాంటి వారి ఉదాహరణలు చెప్తారు. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప, సామాన్యులు ఎవరూ దీంతో బాగుపడింది లేదూ అంటారు వ్యతిరేకులు. షేర్లు కొని చేతులు కాల్చుకున్న వారిలో తమకు తెలిసిన వారి పేర్లను ఉదాహరణగా చెప్తారు.
అసలీ స్టాక్ మార్కెట్ ఎవరికి ఉపయోగం? 10 కోట్ల పెట్టుబడి పెట్టి, వందల కోట్ల పెట్టుబడులను సమీకరించుకోవడానికి కంపెనీలకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో షేర్లు కొన్న వారికి ఏమి ఉపయోగం అనేదానిపై భిన్న వాదనలున్నాయి. అయితే, మన సమాజంలో వాస్తవాలన్ని పరిశీలిస్తే, కొన్నేళ్లుగా షేర్లు కొనేవారిలో నికరంగా లాభపడ్డారా లేక నష్టపోయారా అని అడిగితే, నష్టం మూటగట్టుకున్న వారే ఎక్కువగా కనిపిస్తారు. షేర్ల మోజులో పడి ఆస్తులు హారతి కర్పూరంలా కరిగించుకున్న వారూ ఉన్నారు. అప్పుల పాలై దివాళా తీసిన వారూ ఉన్నారు. అత్యాశతో దెబ్బతిన్న వారూ ఉన్నారు.
అది నిజం కాదని, షేర్ల వల్ల లాభపడ్డ వారు చాలా మందే ఉన్నారనే వాదన ఉంది. బహుశా లాభపడ్డవారు బయటకు చెప్పక పోవడం వల్ల వారి గురించి పెద్దగా తెలియదు అంటారు. అది ఎంత వరకూ నిజమో తెలియదు. నష్టపోయిన వారు మాత్రం కళ్లముందు కనిపిస్తుంటారు. వారి ఆర్థిక స్థితే వారి గురించి చెప్తుంది.
బడా ధనవంతులు డబ్బు సమీకరించుకోవడానికి సామాన్యును సమిధలు అవుతున్నారనే వాదనలో నిజం ఉందో లేదో తెలిస్తేనే, ఈ మార్కెట్ మొత్తం మీద లాభకరమా లేక నష్టదాయకమా అనేది అంచనా వేయగలం. ఈలోగా ఇంకెన్ని సార్లు మార్కెట్ పడిలేస్తూ పులి జూదాన్ని తలపిస్తుందో?