హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వదిలి ఇటీవల టీఆర్ఎస్లోకి వచ్చిన డి.శ్రీనివాస్‌కు ప్రత్యేక సలహాదారు పదవి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వటంపై పార్టీలోని తొలితరం నేతలు పలువురు రగిలిపోతున్నారు. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎంతోమంది ఉండగా ఇటీవలే పార్టీలోకొచ్చిన డీఎస్‌కు కీలక పదవి ఇవ్వటంవలన మొదటినుంచి పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారని పాత నేతలు వాపోతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న ఎన్నికలలో ఆ ప్రభావం కనపడటం తథ్యమని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్ళే ధైర్యం ఎవరికీలేకపోవటంతో సీనియర్ నాయకులు ఎవరికి వారు లోలోపల రగిలిపోతున్నారు. కానీ అంతర్గతంగా పార్టీలో ఇది పెద్ద చర్చనీయాంశమయింది. మొదటినుంచి పార్టీలో ఉన్నవారిని నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు, శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆరుగురు సలహాదారులు ఉండగా అంతర్ రాష్ట్ర సంబంధాలపేరుతో మరొక సలహాదారు అవసరముందా అని అడుగుతున్నారు. డీఎస్‌కు పదవి ఇవ్వటంవలన సంబంధిత శాఖ మంత్రి, అధికారులు అందరూ ఇప్పుడు ఆయనదగ్గరకు వెళ్ళి సమాధానం చెప్పుకోవలసి వస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన తలసాని శ్రీనివాస యాదవ్, తుమ్మల నాగేశ్వరరావువంటి నాయకులకు మంత్రి పదవులు ఇవ్వటంపై ఇప్పటికే అసంతృప్తి ఉండగా మళ్ళీ డీఎస్‌కు సలహాదారు పదవి ఇవ్వటమేమిటని అడుగుతున్నారు. ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వటంవలన పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని, అతను అంత గొప్ప నాయకుడేమీ కాదని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తలసాని, తుమ్మల ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.