రాష్ట్ర విభజన కారణంగా దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలంటే చంద్రబాబు నాయుడు వంటి మంచి పరిపాలనానుభావం ఉన్నవాడు, కార్యదక్షత గలవాడు మాత్రమే క్లిష్టమయిన ఆపనిని సమర్ధంగా చేయగలడని ప్రజలు భావించబట్టే తెదేపాకు ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఏడాదిన్నర గడుస్తున్న రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది తప్ప చంద్రబాబు మార్క్ పరిపాలన కనబడటం లేదని ప్రజలు అనుకొంటున్నారని మొన్న విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో తెదేపా నేతలు ఆయనతో అన్నట్లు సమాచారం. అందుకు ఆయన ఏదో సంజాయిషీ లేదా సమాధానం ఇచ్చి ఉండవచ్చును. కానీ అయన మళ్ళీ ఇదివరకులా పనిచేసి తన సమర్ధత నిరూపించుకొన్నప్పుడే ప్రజాభిప్రాయం మాత్రం మారుతుంది.
ఇంతకు ముందు సమైక్య రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు, అధికారుల పట్ల కటినంగా వ్యవహరించడం వలన ప్రభుత్వం చాలా చురుకుగా పనిచేసేది. ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు ఆయన చుట్టూ కార్పోరేట్ల కోటరీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆయనకి ప్రజలకి, పార్టీలో సీనియర్లకి, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి మధ్య ఆ కార్పోరేట్ నేతలు అడ్డుగోడలా నిలబడి ఉండటంతో ఆయన ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని ఆపార్టీ వర్గాలలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు పార్టీలో సీనియర్లను తన మంత్రివర్గంలోకి తీసుకొన్నప్పటికీ కొత్తగా వచ్చిచేరిన ఆ నలుగురు మంత్రుల పెత్తనమే ఎక్కువగా కనబడుతోంది. చివరికి అది ఎంతగా పెరిగిందంటే ఆ నలుగురే ప్రభుత్వం తరపున అన్ని విషయాల గురించి మాట్లాడుతుంటే పార్టీలో సీనియర్లు అందరూ మౌనం వహించాల్సి వస్తోంది. వారి అత్యుత్సాహం చూస్తుంటే రాష్ట్రాన్ని వారే పాలిస్తున్నట్లుంది తప్ప చంద్రబాబు నాయుడు పాలిస్తున్నట్లే లేదని ప్రజలలో ఒక అభిప్రాయం కలుగుతోంది. కనుకనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మార్క్ పరిపాలన కనబడటం లేదని ప్రజలు భావిస్తే అసహజమేమీ కాదు.