హైదరాబాద్: గుజరాత్లో ఓబీసీ కోటాలోకి చేర్చాలంటూ పటేల్ సామాజికవర్గం సభ్యులు చేస్తున్న ఆందోళన మరింత హింసాత్మకరూపు దాల్చింది. వివిధ హింసాత్మక ఘటనలలో మొత్తం ఆరుగురు చనిపోయారు. పరిస్థితిని అదుపు చేయటానికి గుజరాత్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్‌ను అరెస్ట్ చేయటంతో ఆందోళన హింసాత్మకరూపు దాల్చింది. అరెస్ట్‌కు నిరసనగా ఇవాళ గుజరాత్ వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. హార్దిక్ పటేల్‌ను తర్వాత విడుదలచేశారు. అయితే అహ్మదాబాద్, సూరత్, మెహసానా, విస్నగర్, ఉనిఝా పట్టణాలలో కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఇంతకూ పటేల్ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున రేగటానికి, కేంద్రంలోని పెద్దలకు చెమటలు పట్టించటానికి కారణమైన ఆ హార్దిక్ పటేల్ ఎవరనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన హార్దిక్ పటేల్ తలపండిన రాజకీయవేత్త అయి ఉంటాడని, కాకలు తీరిన నాయకుడని అందరూ అనుకుంటారు. కానీ అతను 22 ఏళ్ళ కుర్రాడని తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. గుజరాత్‌లోని పటేల్ సామాజికవర్గంలో సంపన్నులు బాగానే ఉన్నా, అత్యధికులు మధ్యతరగతి జీవులే. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండటం, కోర్సుల ఫీజులు ఆకాశాన్నంటటం, రిజర్వేషన్లు, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై పటేల్ యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన హార్దిక్ పటేల్ ఈ అసంతృప్తిని గురించి బాగా అధ్యయనం చేసి ‘పటీదార్ అమానత్ ఆందోళన్ సమితి'(పాస్) అనే సంస్థను స్థాపించాడు. తమ సామాజికవర్గంలోని వివిధ వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని ప్రారంభించాడు. కొద్దిమందితో ప్రారంభించి సమావేశాలతో చైతన్యాన్ని రగిల్చాడు. రిజర్వేషన్లలో తమకు జరుగుతున్న నష్టాన్ని స్పష్టంగా విడమరిచి చెప్పాడు. అలా ప్రారంభమైన ఉద్యమం భారీ బహిరంగసభల స్థాయికి ఎదిగింది. హార్దిక్‌కు అనూహ్యమైన ప్రజాదరణ ఏర్పడింది. అతని సభ అంటే పటేల్ సామాజికవర్గంలోని పిల్లా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా అందరూ వచ్చేస్తారు. ఈ క్రమంలో హార్దిక్‌ను కట్టడి చేయటంకోసం ప్రభుత్వం అతనిని అరెస్ట్ చేయటంతో ఉద్యమం మరింత తీవ్రరూపుదాల్చింది. ఇది ఇప్పుడు ఎటు వెళుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.