చంద్రబాబు నాయుడు ఉద్యోగుల జీతాలు పెంచడం లేదా? రుణాలు మాఫీ చేయడం లేదా? ధరలు అదుపు చేయలేకపోతున్నారా? కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో విఫలం అవుతున్నారా? ప్రత్యేక హోదా సాధించడం లేదా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం లేదా? రైతుల భూములు బలవంతంగా లాక్కొంటున్నారా? అయితే అన్నిటికీ ఒకటే పరిష్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవడం! చంద్రబాబు నాయుడు పరిష్కరించలేని ఈ సమస్యలన్నీ చకచకా పరిష్కరింపబడాలంటే, ప్రజలు కష్టాలన్నీ తీరిపోవాలంటే, మోడీ మెడలు వంచి అన్ని హామీలు కక్కించాలంటే వాటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమే ఏకైక పరిష్కారం. కానీ అందుకు మరో మూడేళ్ళ గడువు ఉందని జగనే స్వయంగా ఈరోజు ప్రకటించారు.మూడేళ్ళ తరువాత ప్రభుత్వం కూలిపోవడం తను ముఖ్యమంత్రి అయిపోవడం తధ్యమని ఈరోజు విజయవాడలో ప్రకటించేశారు.
తను ముఖ్యమంత్రి అయిపోగానే రైతుల నుండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుంజుకొన్న భూములన్నిటినీ తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడుకి జగన్ రెండేళ్ళే గడువు ఇచ్చారు. కానీ ఇవ్వాళ్ళ మరో ఏడాది పెంచి దానిని మూడేళ్ళు చేసారు? కనుక అంతవరకు చంద్రబాబు నాయుడు నిశ్చింతగా ఇష్టారాజ్యం పాలించేసుకోవచ్చును. ఒకవేళ ఆయన అదృష్టం బాగున్నట్లయితే జగనే మళ్ళీ ఆయనకి మరో ఏడాది ఎక్స్ టెన్షన్ ఇచ్చినా ఇవ్వవచ్చును. కానీ మూడేళ్ళ తరువాత ప్రభుత్వం కూలిపోవడం తధ్యమని చెప్పారు. ఏవిధంగా కూలిపోతుందో కూడా చెప్పి పుణ్యం కట్టుకొంటే అందరూ ఆయన దగ్గరే జాతకాలు చెప్పించుకొనేవారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు మిగిలిన ఈ మూడేళ్ళలో తను రైతుల దగ్గర నుండి సేకరించిన భూములలో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు వంటి భారీ కట్టడాలను నిర్మించిపడేస్తే వాటి క్రింద నుండి రైతుల భూములు తీయడానికి జగన్ వద్ద ఏమయినా కొత్త టెక్నాలజీ ఉందా లేకపోతే భవనాలను ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక రాజధానిలో భవనాలన్నిటినీ ఏ కడప జిల్లాకో, నెల్లూరు జిల్లాకో జరిపేసి, తిరిగి రైతుల భూములు రైతులకు ఇచ్చేయాలనుకొంటున్నారో తెలిపితే రైతులకి కూడా తమ భూముల విషయంలో కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎటువంటి కన్ఫ్యూజింగ్ లేకుండా ఆయననే ముఖ్యమంత్రిని చేసుకొంటారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవిషయాలన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ మిగిలిన ఈ నాలుగేళ్ళలో…సారీ మూడేళ్ళలో… ఫౌండేషన్ కొంచెం గట్టిగా వేసుకొంటే మంచిది…లేకుంటే ఆయన కుర్చీతో సహా అన్నీ కదిలిపోయే ప్రమాదం ఉంది.