రాజమౌళి స్ట్రాటజీ చాలా భిన్నంగా ఉంటుంది. తన సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి సొమ్ము చేసుకోవొచ్చని బాహుబలితో నిరూపించుకొన్నాడు. ఇప్పుడూ అలాంటి వినూత్న ప్రయత్నమే చేస్తున్నాడు. బాహుబలి ది కన్‌క్లూజన్ ఈనెల 28న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి పార్ట్ 2 కంటే ముందు పార్ట్ 1ని ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు. అదీ… హిందీలో. రేపు (ఏప్రిల్ 7న) బాహుబలి ది బిగినింగ్ హిందీ వెర్షన్ రీ రిలీజ్అవ్వబోతోంది. ముంబై, ఇతర ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో బాహుబలిని చూడొచ్చు. బాహుబలి 2 చూసే ముందు బాహుబలి 1 చూస్తే కథలో కంటిన్యుటీ తెలుస్తుందన్నది రాజమౌళి ఆలోచన. అదీ నిజమే. ఎందుకంటే.. బాహుబలి 1 విడుదలై.. దాదాపు రెండేళ్లయ్యింది. బాహుబలి 2 కంటిన్యుటీ కోసమైనా బాహుబలి 1 చూపించడం బెటర్.
అయితే.. ఆల్రెడీ టీవీల్లో బాహుబలి చాలా సార్లు ప్రదర్శితమైంది. యూ ట్యూబ్ లోనూ ఉంది. ఇప్పటికే ఈ సినిమాని చాలా సార్లు చూసేశారు. ఇప్పుడు మళ్లీ థియేటర్లో చూస్తారా? అదీ టికెట్టు కొనుక్కొని…? అనేది అనుమానంగా మారింది. అయితే… మల్టీప్లెక్స్‌లో అడ్వాన్స్ బుకింగులు మొదలైపోయాయని టాక్. థియేటర్లు హౌస్‌ఫుల్ కాకపోయినా కనీసం సగమైనా నిండే ఛాన్సుంది. ఎందుంకంటే బాహుబలి లాంటి సినిమాని చిన్న చిన్న స్క్రీన్‌లో చూస్తే కిక్ ఉండదు. ఈ విజువల్ వండర్ని వెండితెరపైనే చూడాలి. అందుకే రీ రిలీజ్ అయినా సరే టికెట్లు తెగుతాయని రాజమౌళి భావిస్తున్నాడు.చూద్దాం సెకండ్ రిలీజ్ లో బాహుబలి సత్తా ఏంటో?