తాను బిజెపిలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఆ అవసరం తనకు లేదని, అమిత్‌షాను కూడా కలవబోవడం లేదని వివరించారు. అంతటితో ఆగక తనను బదనాం చేయడానికే ఇలాంటి కథనాలు ప్రచారంలో పెడుతున్నారని ఆరోపించారు. తనను అప్రతిష్టపాలు చేసి రాజకీయ జీవితంతో ఆడుకోవాలని కొందరు కుట్రపన్నుతున్నట్లు విమర్శించారు. ఇంతకూ అవన్నీ చేస్తున్న వారెవరు? సొంత పార్టీ వారా? లేక బిజెపి వారా? కాదంటే టిఆర్ఎస్సా? అన్నది రేవంత్ చెప్పలేదు. కాబట్టి ఎవరైనా, ఏదైనా అనుకోవచ్చు. ఇంతకూ ఈ వార్త పూర్తిగా అసత్యం కాదని బిజెపి వర్గాలు కూడా చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి వంటివారు తమతో ”టచ్”లో ఉన్నమాట నిజమేనని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నాయి కనుక కొంత కాలం వేచి చూసి, నిర్ణయం తీసుకుందామని వారి ఉద్దేశం కావొచ్చని బిజెపి నేత ఒకరు వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ కార్యకలాపాలకు నిధులు ఇవ్వకపోగా నిర్దేశకత్వం చేయడానికి కూడా సమయం లేదని చంద్రబాబు నాయుడు, లోకేష్ వంటివారు నిరాసక్తత చూపుతున్నారు. మరో వైపున కెసిఆర్‌తో సహా మొత్తం తెలంగాణ నాయకులు టిడిపిపై కత్తికట్టి దూకుడుగా వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నాయకత్వం ముందుకొచ్చి ఆదుకోకపోతే తాముగా ఏం చేయాలన్నది రేవంత్ వంటి వారికి పాలుపోవడం లేదు. రెడ్డి సామాజిక వర్గం తరఫున కాంగ్రెస్‌లో చేరి, తదుపరి ఎన్నికల పోరాటానికి నాయకత్వం వహించవచ్చని ఆయన కొంతకాలం భ్రమపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీయే విభేదాలతో సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు రేవంత్‌ను స్వాగతించి సర్దుబాటు చేసుకునే వారు ఎవరు ఉంటారు? కనుకనే కాంగ్రెస్ కన్నా బిజెపి మెరుగని వారు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడమే కాక, ఏపీలో టిడిపి మిత్రపక్షంగా కూడా బిజెపి ఉంటున్నది. రేవంత్ మాత్రమే కాక చాలా మంది తెలుగుదేశం నాయకుల పేర్లు కూడా ఈ సమయంలో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టిడిపి వర్గాల అంతర్గత వివరణ మరోలా ఉంది. గెలిచినా, ఓడినా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తానని రేవంత్ షరతు పెట్టాడట. గత ఎన్నికల సమయంలో టిడిపి బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా పెద్ద ప్రయోజనం కలిగింది లేదు. రేవంత్ విషయంలోనూ అదే పొరపాటు పునరావృతం కారాదని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఏ కోశానా అందుబాటులోలేని ఒక పదవికోసం ఇంతగా వెంపర్లాడటం మంచిదికాదని కూడా రేవంత్‌కు హితవు పలుకుతున్నారు. పైగా ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, టిఆర్ఎస్తో ఢ అంటే ఢ అని తలపడినట్లవుతుంది. ఇప్పటికే తెలంగాణలో పూర్తిగా బిచాణా ఎత్తివేసిన చంద్రబాబుకు అది ఇష్టం లేదు. ఈ పరిస్థితిలో వెనువెంటనే కాకపోయినా, భవిష్యత్తులో రేవంత్ తమవైపునకు రావడం తప్పనిసరి అని బిజెపి నేతలు ఒక విధమైన భరోసా వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవంత్ తాజాగా ఖండిస్తున్నారు గనుక ఏం జరిగేది ముందు ముందు గానీ తేలదు.