తెలంగాణలో తమ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలనుకుంటున్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనను న్యూట్రలైజ్ చేయడం కోసం మంత్రి కేటిఆర్ విస్తృత పర్యటనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రచార యజ్ఞంలో చెల్లెలు నిజామాబాద్ ఎంపీ కవిత ఆయనకు తోడయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్ నియోజకవర్గంలో మొదటిసారిగా కెటిఆర్, కవిత బహిరంగ సభలో వివరంగా మాట్లాడారు. అక్కడి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పనిగట్టుకుని ఈ కాంబినేషన్‌ను రప్పించిఉండవచ్చు. మామూలుగా కవిత బిజెపితో మంచిగా ఉండి, కేంద్రంలో మంత్రి పదవి సంపాదించాలని ఆశ పడుతున్నట్లు చెబుతారు. ఆమె కూడా కేంద్రంలో చేరిక విషయం పరిశీలిస్తున్నట్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కెటిఆర్, కవిత ఒకే సభలో సుదీర్ఘంగా ప్రసంగించడం, రాజకీయ వ్యూహంలో భాగం కావొచ్చు. కవిత అప్పుడప్పుడు బిజెపిపై స్వల్ప వ్యాఖ్యలు చేయడం తప్ప, విమర్శించింది లేదు. కెటిఆర్ మాత్రం కాంగ్రెస్, బిజెపిలను విమర్శిస్తుంటారు. అన్నా, చెల్లెలు ఒక వేదికపై ఎందుకు పాల్గొనలేదో కూడా తెలియదు. ఇప్పుడు వాటన్నిటిని వెనక్కు నెట్టి ఒకే సభలో ప్రసంగించారంటే ఎన్నికల నాటికి వాతావరణం పూర్తిగా తమవైపుకు తిప్పుకోవాలని గట్టి పట్టుదలతోనే ఉన్నారన్నమాట.
ఇదిలాఉంటే భద్రాచలంలో శ్రీరామ నవమి వస్త్రాలను తలంబ్రాలను కెసిఆర్ మనవడైన హిమాంషు తీసుకువెళ్లడం వారసత్వ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెర లేపిందంటే, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు తొలిసారి హిమాంషు తాతయ్యతో కలిసి కనిపించారు. అప్పటినుంచి అడపా దడపా ఆయనపై కథలు, కబుర్లు వెలువడుతూనే ఉన్నాయి. ఒకరోజు తాత లేనప్పుడు సచివాలయాన్ని సందర్శించారు. ఒక నిర్మాత తనతో సినిమా నిర్మాణం జరుగుతుందని ప్రకటించి వెనక్కు తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో హిమాంషు అధికారికంగానే ”కుటుంబం తరఫున” భద్రాచలం రాములవారికి వస్త్రాలు తీసుకెళ్లారంటే తాతగారి దూరదృష్టి మనవడి దూకుడు అర్థమవుతాయి.