kuchimanchi vs subrahmanyam
కరకు ఆరెస్సెస్ వాదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగీ ఆదిత్యనాథ్ జారీ చేసిన ఉత్తర్వులకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మాంస విక్రయాలను అదుపుచేసేందుకు వీలుగా కబేళాలను మూసేయాలని ఇచ్చిన ఆదేశాలపై ఓ వ్యాపారి వేసిన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు దీన్ని రూఢీ చేస్తున్నాయి. తమకు ఇష్టమైన ఆహారాన్ని తినడం, ఆహార పదార్థాల వ్యాపారం జీవించే హక్కులో భాగమేనని కోర్టు అభిప్రాయపడింది. అక్రమ కబేళాలు, మాంస దుకాణాలపై యోగి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు పదిరోజుల సమయాన్నిచ్చింది. ప్రభుత్వ అధికారాన్ని ఆమోదిస్తూనే అదే సమయంలో ప్రజల ఉపాధి దెబ్బతినకుండా కూడా చూసుకోవాల్సిన అవసరముందని హితవు పలికింది. లౌకిక సంస్కృతిలో ఆహార అలవాట్లూ ఓ భాగమని తెలిపింది. ఉత్తర ప్రదేశ్ ప్రజలకు వివిధ ఆహార అలవాట్లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తెరగాలని ధర్మాసనం తెలియజేసింది. తన ఉపాధికి మూలమైన మాంసం దుకాణం లైసెన్సును ప్రభుత్వం రద్దు చేసిందనీ, దాన్ని తక్షణం పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలనీ ఓ వ్యాపారి చేసుకున్న విన్నపం అలహాబాద్ హైకోర్టును కదిలించింది. మాంసం దుకాణాలకు లైసెన్సులివ్వడంలో జాప్యం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయనీ ఆ వ్యాపారి తన పిటిషన్లో వివరించాడు.
మహాభారతంలో ధర్మరాజుకు మార్కండేయ మహర్షి బోధించిన అంశాలను ఇక్కడ ప్రస్తావనార్హం. ఎలా పరిపాలన చేయాలో వివరిస్తున్నప్పుడు వీటిని చెబుతాడు. రాజ్యంలో విద్య, వైద్యం, ఆహారం విక్రయించకూడదనేది అందులో ప్రధానమైనవి. వీటిని విక్రయించడం పాపమనీ, అలా చేస్తే స్వార్థం పెరిగిపోతుందనీ వివరిస్తాడు. ఈ మూడూ పాటిస్తే రాజ్యం స్వర్గ తుల్యమవుతుందనీ సూచించాడు. సునిశితంగా ఆలోచిస్తే ఇందులో ఎంతో వాస్తవం కనిపిస్తుంది. అందరూ సుభిక్షంగా ఉంటారు. ప్రస్తుతం ఈ మూడు అంశాలపైనే వ్యాపారాలు కేంద్రీకృతమయ్యాయి. లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. మంచి సంస్థలో విద్యను అభ్యసించాలంటే లక్షలాది రూపాయలు పోయాల్సిందే. ఆ సంస్థలలో చదివిన వారికి పోసిన డబ్బుకు సమానంగా ఉన్నతోద్యోగాలు లభిస్తున్నాయి. మేధ ఉండీ డబ్బులేక సరైన విద్యాసంస్థలో చదవలేకపోతే ఏ కంపెనీలోనూ గుమస్తాగా నెట్టుకురావాల్సి వస్తోంది. ఆహారం విషయానికొస్తే… శాకాహారమైనా.. మాంసాహారమైన వండి వడ్డించడానికి చవులూరించడానికి అన్న విక్రయశాలలు వెలిశాయి. వందలాది రూపాయలు వెచ్చించడానికి సైతం ప్రజలు వెనుకాడకపోవడం వారికి పట్టపగ్గాలు లేకుండా చేసేస్తున్నాయి. వైద్యం విషయమూ ఇంతే. కాలం మారిన పరిస్థితుల్లో సంక్రమిస్తున్న వ్యాధులూ, పీడితుల్లో సహనం లేకపోవడం కారణంగా వైద్యుల చుట్టూ తిరగడం వల్ల లక్షలాది రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రారంభించిన ఆస్పత్రులు అందులోని పరికరాలూ, వాటి నిర్వహణకు ఆయా సంస్థలు రోగుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేస్తున్నారు. వైద్యులకు టార్గెట్లు నిర్దేశిస్తున్నారు. జీతం రావాలంటే టార్గెట్ను చేరుకోవాల్సిందే. అందుకోసం అయినవీ అవసరం లేనివీ టెస్టులు రాసేస్తూ రోగి శరీరాన్ని విపరీతంగా బాధపెడుతున్నారు. ఆఖరుకు తేలేది శూన్యం. క్షేమంగా బయటపడేవి పదింటిలో ఒకటో రెండో కేసులు మాత్రమే. నాడి చూసి, వ్యాధికి మందులు ఇచ్చి, రోగాన్ని నయం చేసే వైద్యుల కాలం నుంచి, లక్షలాది రూపాయలు వెచ్చించినా రోగమేమిటో తేల్చలేని అధిక శాతం వైద్యులు, సంస్థలున్న నేటి కాలాన్ని పోల్చుకుంటే మార్కండేయ మహర్షి మాటలు ఎంత అక్షర సత్యాలో తేలుతోంది. ఆహారమైనా.. విద్యయినా..వైద్యమైనా అంతా వాణిజ్యమయమైపోయింది.
ఇలాంటి నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యలు ఎంతవరకూ ఫలిస్తాయనేది అనుమానమే. ఆయన ఈ మూడు రంగాలపైనా దృష్టి సారించి, అదుపు చేయగలిగితే, కార్పొరేట్ విద్య, వైద్యం నిర్వహిస్తున్న వారు మంత్రులుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు మార్గదర్శి కాగలరు. ఆంధ్రలో జరుగుతున్నదేంటో వివరంగా చెప్పాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. సనాతన ధర్మాన్నీ, పద్ధతులను విడనాడి నేలవిడిచి సాము చేయడానికీ అందరూ అర్రులు చాస్తుండడమే ప్రస్తుత పరిస్థితులకు కారణం. ఆ దిశగా ఏ ఒక్కరో కాకుండా అందరూ సకారాత్మక దృక్పథంతో ఆలోచించినప్పుడే.. దీన్ని నివారించడం, అందరికీ అన్నీ అందుబాటులోకి తేగలగడం సాధ్యం.