ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పొరేటర్ల ఉప ఎన్నికల ఫలితాలలో పాలక తెలుగుదేశం పార్టీకి వూహించిన దెబ్బ అది కూడా తగలకూడని చోట తగిలింది. రాజధాని కేంద్రమైన మంగళగిరి మునిసిపాలిటిలో గతంలో తమ చేతిలో వున్న 31 వ వార్డు టిడిపి చేయిజార్చుకుంది. వైసీపీ అభ్యర్థి మేరుగుమిల్లి వెంకటరమణ 153 ఓట్ల మెజార్టితో గెలుపొందారు. 2014లో ఇక్కడ గెలిచిన టిడిపి కార్పొరేటర్ మురళీకృష్ణ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అవసరమైంది. .
మంగళగిరికి వైసీపీ ఎంఎల్ఎ బడా వ్యాపారవేత్త ఆళ్ల రామకృష్ణారెడ్డిప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై పిటిషన్ వేసి తిరగదోడింది కూడా ఆయనే.తమ ప్రచారానికి కేంద్రంగా వున్న రాజధాని ప్రాంతంలోనే ఓటమి రాజకీయంగా దెబ్బ అని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.ఆంధ్రజ్యోతి ఈ ఓటమికి టీడీపికి వైసీపీ ఇచ్చిన షాక్‌గా అభివర్ణించింది.కడపజిల్లా రాయచోటి ఉప ఎన్నికలో కూడా వైసీపీ గెలిచింది. ఇక తక్కిన అన్ని చోట్ల టిడిపి విజయం సాధించినట్టు సమాచారం.
ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ వారసత్వం రీత్యా కీలకమైన గుడివాడ మునిసిపాలిటీ 19వ వార్డులో టిడిపి అభ్యర్థి ప్రసాద్ 149 ఓట్ల మెజార్టితో వైసీపీని ఓడించారు. ఎమ్మెల్యే కోడాలి నాని వ్యక్తిగతంగా పోరాడినా ఈ స్థానం నిలబెట్టుకోలేకపోవడం వైసీపీకి దెబ్బే. ఈ ఫలితం తర్వాత శరత్ టాకీస్ సెంటర్లో ఇరు పార్టీల మద్యన ఘర్షణ జరిగింది.