తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని మంచి నిర్ణయాలు చేసి వుండొచ్చు. ఇంకా చేయొచ్చు కూడా. మీడియా వాటికి తగు ప్రచారమివ్వడం, ప్రశంసించడంలో తప్పులేదు. కాని కొన్ని ప్రధాన పత్రికల సంపాదకుల తీరు చూస్తుంటే అంతకుమించిన అతిభజన స్థాయికి చేరుతున్నది. వారు ఏమి ఆశిస్తున్నారో తెలియదు కాని పాఠకులు ప్రజలు మాత్రం పొగడ్తలతో పాటు విమర్శనాత్మక వివేచన కోరుకుంటారు. పొగడ్డానికి వందిమాగధులు ఎలాగూ చుట్టూనే వుంటారు కదా!
ఉచిత ఎరువల పేరిట రైతులకు నగదు బదిలీ చేయాలని కెసిఆర్ ప్రకటించిన తాజా నిర్ణయం ఈ ప్రశంసకులకు పరవశింపచేసింది. ఆదివారం(ఏప్రిల్16) మూడు ప్రధాన పత్రికలలో సంపాదకులు అంతకంటే పై వారు కూడా సంతకాలు చేసి మరీ ఎంతగా పోగిడేశారో చూడండి:
సాక్షి
”తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కెసిఆర్) పని నల్లేరు మీద బండిలాగా సాగిపోతోంది.ఏది చేయాలనుకుంటే అది చేయగల స్థితిలో ఆయన వున్నారు.” ఇవి సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి త్రికాలంలో రాసిన వ్యాసం తొలి వాక్యాలు.
..”ఇంతవరకూ పనితీరుకు కెసిఆర్‌కు ‘ఎ’ గ్రేడ్ ఇవ్వవచ్చు. మరింత ప్రజాస్వామ్యస్పూర్తి ప్రదర్శించి ఎ+గ్రేడ్ కోసం ప్రయత్నించవచ్చు.” ఇవి చివరి వాక్యాలు. ఈ మధ్యలో మూడుసార్లు అభినందనలూ, ఒకసారి స్వాగతించడం, ఒకసారి గొప్ప చొరవ అని పొగడ్త.
నమస్తే తెలంగాణ
సరే ఇది ఎలాగూ కెసిఆర్ అధికార లేదా అనధికార పత్రికగా చెప్పొచ్చు. రోజూ ముఖ్యమంత్రి కీర్తనల్లోనే మునిగితేలుతుంటుంది. అయినా ఈ అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి మరో సారి విజృంభించారు.
” కెసిఆర్ మది ఆలోచనల కార్ఖానా.నిరంతరం కొత్తగా ఆలోచించడం ఆయన అలవాటు. తన సహచరుతో కూడా ఆయన అదే చెబుతారు. ధింక్ ఔట్ ఆఫ్ బాక్స్.. పరిష్కారం కానదంటూ ఏదీ వుండదని చెబుతుంటారు. అటువంటి ఆలోచనా ధార నుంచే సంచలనాత్మకమైన ఈ ప్రతిపాదన వచ్చి వుంటుందని వేరే చెప్పవనసరం లేదు.”
ఆంధ్రజ్యోతి
ఇక దమ్మున్న పత్రిక ధైర్యమున్న అధినేత ఆర్కే కొత్త పలుకులో కెసిఆర్‌ను ఎలా పొగిడారో చూడండి:
‘ఉచిత ఎరువులతో మరో దెబ్బ” అని శీర్షిక.
”.. కెసిఆర్ తీసుకుంటున్న ఏ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేని స్థితిలో ప్రస్తుతం ప్రతిపక్షాలు వున్నాయి..”
”..ముఖ్యమంత్రి కెసిఆర్ తాజా నిర్ణయంతో రైతులందరూ ఆయనను గుండెల్లో పెట్టుకుని కొలుస్తారు.”
” రాజకీయ ఎత్తుగదలు, రణతంత్రను జిత్తులలో తెలంగాణలో కెసిఆర్‌ను ఢకొీనగల మరో నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు.”
”అప్పుడు రాజశేఖరరెడ్డి వ్యూహాలను తట్టుకోలేక ప్రతిపక్షాలు గిలగిలా కొట్టుకున్నట్టుగా ఇప్పుడు కెసిఆర్ ముందు నిలబడలేక ప్రతిపక్షాలు విలవిలలాడుతున్నాయి?”
చెప్పాలంటే ఇలాటివి ఇంకా చాలా ఉదహరించవచ్చు. మంచి పనిని మెచ్చుకోవడం వేరు. మెప్పించడం కోసం పొగడ్తలు కీర్తనలు గుప్పించడం వేరని విజ్ఞులైన మన సంపాదక మహాశయులకు తెలియదా? అయితేనేం? ఏలిన వారిని మంచి చేసుకోవాలి కదా!
ఇవన్నీ గాక మరో పేద్ద పత్రిక అక్షరాక్షరం అనుకూల కథనాలతో అలరాలుతుంటుంది గనక ఇలాటి ప్రత్యక వ్యాఖ్యలతో పని వుండదు.
సారాంశం ఒక్కటే జీ హుజూర్, కెసిఆర్!