ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకున్న విధంగా అమరావతి స్టార్టప్ క్యాపిటల్ ప్రాజెక్టును స్విస్ ఛాలెంజి పేరుతో సింగపూర్ కన్సార్టియంకు అప్పగిస్తున్నది. మంగళవారం క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్టార్టప్ క్యాపిటల్‌గా చెబుతున్న ఈ భాగంలో సింగపూర్ కంఎనీలు ఎసెండాస్ సింగ్‌బ్రిడ్జి సెంబ్ కార్ప్ కలసి కన్సార్టియంగా ఏర్పడ్డాయి. తర్వాత కాలంలో హైకోర్టు ఈస్విస్ ఛాలెంజిపద్దతి లోపభూయిష్టంగా జరిగిందని ఒకసారి తిప్పి పంపింది. అయినా దాన్ని పైపై మార్పులతో మరోసారి ఆమోదించి మమ అనిపించారు. కోర్టు విచారణకు ముందే ఎపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబిలింగ్ యాక్ట్‌ను సవరించారు. ఎందుకంటే సింగపూర్ కంపెనీలను ఒకటిగా ఏర్పడమని చెప్పామని కూడా ముఖ్యమంత్రి ముందే ప్రకటించారు. అసలు రాజధాని అన్నప్పటినుంచి సింగపూర్ స్మరణమేనని అందరికీ తెలుసు. ఇప్పుడు కన్సార్టియంను, ప్రభుత్వం ఏర్పాటు చేసే అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్‌ను కలిపి ఒక సంస్థగా నెలకొల్పుతారు. ఇందులో భూమి ఇవ్వడమే గాక 5వేల కోట్లకు పైగా ప్రభుత్వం వ్యయం చేస్తుంది. కన్సార్టియం ముచ్చటగా మూడు వందల కోట్టతో సరిపెట్టి కథ నడిపిస్తుంది. లాభాల్లో ప్రభుత్వానికి 42శాతం, వారికి 58 శాతం రావాలి. అయితే అది కూడా ఇప్పుడే కాదు. ఈ లోగా ప్రభుత్వం ఐకానిక్ కట్టడాలకోసం 50 ఎకరాలు వుచితంగానూ, మరో 200 ఎకరాలు రు.4 కోట్ల చొప్పున కేటాయిస్తుంది. ఇంతా చేసి ఈ ప్రాజెక్టు మూడు దశలుగా పదిహేనేళ్లలో పూర్తవుతందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మొదట్లో అంత డిమాండు వుండకపోవచ్చనీ ఆయనే సన్నాయి నొక్కులు నొక్కారు. మరి ఇంత కాలంగా 30 వేల ఎకరాలకు పైగా సేకరించి నిరుత్సాదకంగా ఎందుకు వుంచినట్టు? అదిగో ఇదిగో అంటూ రాజధాని గురించి ఎందుకు వూరించినట్టు? వాణఙజ్యపరమైన సీడ్ క్యాపిటల్ కట్టడానికి ఒప్పుకున్న వారు కలకమైన కోర్ క్యాపిటల్ భవనాలు కాలనీలు ఎందుకు కట్టడం లేదు. ఇక్కడ గిట్టుబాటు వుండదనా?