ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం ఏంటో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు అనే విమర్శ ఉంది! అవసరం ఉన్నంత వరకే మనుషుల్ని వాడుకుని, ఆ తరువాత పక్కన పడేయడం ఆయనకి అలవాటనే ఆరోపణ కూడా ఉంది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సేవల్ని ఏ రేంజిలో ఉపయోగించుకున్నారో అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు అదే ఎన్టీఆర్ గురించి ఎపీ మంత్రి నారా లోకేష్ ఏమన్నారో తెలుసా.. పార్ట్ టైమర్ అని! ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారట. ఎన్టీఆర్, టీడీపీల మధ్య దూరం లేదంటూనే.. రాజకీయాలంటే ఫుల్ టైమ్ నాయకులు అవసరమనీ, పార్ట్ టైమ్ వ్యాపారం కాదని లోకేష్ చెప్పారు.
నిజానికి, జూనియర్ ను రాజకీయాల్లోకి లాగిందెవరు..? 2009 ఎన్నికల్లో అతడితో ప్రచారం చేయించింది ఎవరు..? రోడ్డు ప్రమాదం జరిగినా, ఆసుపత్రిలో మంచం మీద కదల్లేని స్థితిలో ఉన్నా కూడా లైవ్ ప్రోగ్రామ్ లు పెట్టి ప్రసంగాలు ఇప్పించింది ఎవరు..? అప్పటికి ఎన్టీఆర్ ఫుల్ టైమరా, పార్ట్ టైమరా..? 2009 నాటికి నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తారన్నది పూర్తిస్థాయిలో కన్ఫర్మేషన్ ఇంకా లేదు. హెరిటేజ్ వ్యాపారాలు చూసుకున్నారు. ఎప్పుడైతే లోకేష్ ని పాలిటిక్స్ లోకి తెద్దామని నిర్ణయించుకున్నారో.. అప్పట్నుంచీ జూనియర్ ను పార్టీకి దూరం చేయడం మొదలుపెట్టారు. మొహమాటానికైనా మహానాడుకు పిలవడం మానేశారు. ఒక్క జూనియరేం ఖర్మ.. ఏకంగా ఎన్టీఆర్ కుటుంబాన్నే తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేని మామూలు వ్యక్తులుగా మార్చేశారనేది జగమెరిగిన సత్యం. ఆ పునాదుల మీద లోకేష్ ను కూర్చోబెట్టాలన్నదే చంద్రబాబు వ్యూహం అనేది బహిరంగ రహస్యం.
సరే… లోకేష్ చెప్పినట్టు ఫుల్ టైమర్లు మాత్రమే పార్టీకి అవసరం అని కాసేపు అనుకుందాం! అలాంటప్పుడు కొన్ని దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న సీనియర్లకు ఇప్పుడు లభిస్తున్న గుర్తింపేదీ..? పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, బుచ్చయ్య చౌదరి… ఇలాంటి వారికి ఈ మధ్య విస్తరణలో మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు..? వైకాపా టిక్కెట్లు మీద గెలిచిన 20 మందిని తెలుగుదేశంలో చేర్చుకున్నారే… వీరంతా ఫుల్ టైమర్లా..? పదవి మీద ఆశో, లేదంటే కేసులున్నాయని భయమో, చంద్రబాబు అంటే భక్తి లాంటి ఫీలింగ్ ఏదో… ఇలాంటి ప్రలోభాలకు లోబడి ఫిరాయించిన వారు ఫుల్ టైమర్లు అవుతారా..?
జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే చర్చకు తెర లేపాయని తెలుస్తోంది. పార్ట్ టైమర్లు, ఫుల్ టైమర్లు అని వ్యాఖ్యానించడం కొంతమంది మనోభావాలను దెబ్బ తీసినట్టే అని ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫ్ ద రికార్డ్ అంటున్నారు! నాయకుల పట్ల పార్టీ అనుసరిస్తున్న తీరుపై చాలామందికి అసంతృప్తి ఉందనీ అంటున్నారు. ఈ టాపిక్ ఎలాంటి చర్చలకు దారితీస్తుందో మరి!