ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించడం ఇప్పుడు చాలా ఈజీ! జంప్ చేశాక మంత్రి పదవి దక్కించుకోవడం కూడా ఏమంత కష్టం కాదు. కానీ, ఆ పదవిలోకి వచ్చిన తరువాత.. ఇతర రాజకీయ పక్షాల నుంచి వినిపించే విమర్శల్ని తట్టుకోవడం అనుకున్నంత ఈజీ కాదు! ఈ తత్వం చాలామందికి బోధపడుతూనే ఉంది. విపక్షాలపై విరుచుపడే రేంజి కంటెంట్ తమ దగ్గర ఉన్నా కూడా ‘జంప్ జిలానీ’ అనే ఒక్క ముద్ర చాలు.. ఆ మైకావేశాన్ని నీరుగార్చేయడానికి. తెరాస నేతల్ని ఎదుర్కోవడంలో ఎప్పటికప్పుడు ఈ అస్త్రాన్నే ప్రయోగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం తెరాస – కాంగ్రెస్ ల మధ్య దిగ్విజయ్ వ్యాఖ్యలపై మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి తలసానికి మరోసారి రాజీనామా సవాల్ ఎదురైంది.
ఒక ఫేక్ వెబ్ సైట్ ద్వారా ఉగ్రవాద సంస్థ ఐసిస్ లోకి ముస్లిం యువతను పంపుతున్నారంటూ తెలంగాణ పోలీసులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గర ఆధారాలున్నాయంటూ మరింత హీట్పెంచారు. చేసిన వ్యాఖ్యలకి కట్టుబడే ఉంటానని కూడా అన్నారు. అయితే, డిగ్గీరాజా తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కి దిగ్విజయ్ వస్తే తరిమితరిమి కొడతామంటూ తలసాని హెచ్చరించారు. ఆయన్ని నగరంలో తిరగనిచ్చేది లేదని అన్నారు.
ఈ వ్యాఖ్యల్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మీడియా ముందుకొచ్చారు. ‘నువ్వు మగాడివే అయితే, నీకు దమ్ముంటే, ముందుగా ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి, తరువాత మాట్లాడు’ అంటూ తలసానికి సవాలు విసిరారు. దిగ్విజయ్ హైదరాబాద్ రాగానే తలసాని ఇంటిముందే మీటింగ్ పెడతాననీ, దమ్ముంటే అడ్డుకోవాలని షబ్బీర్ ఛాలెంజ్ చేశారు. ‘ఒక పార్టీ టిక్కెట్టు మీద గెలిచి, కనీసం రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలన్న సంస్కారం లేకుండా.. మరో పార్టీ తరఫున మంత్రిగా కొనసాగుతున్న నీకు దిగ్విజయ్ సింగ్ ను విమర్శించే అర్హత, హక్కు లేద’ని షబ్బీర్ అన్నారు.
సబ్జెక్ట్ ఏదైనా సరే.. తలసాని తెరమీదికి వస్తే, ముందుగా రాజీనామా గురించే విమర్శిస్తుంటారు! ఎందుకంటే, ఆ టాపిక్ తో మొదలుపెడితేనే తలసాని నుంచి స్పందన రాకుండా ఉంటుంది కదా! పాపం… తలసాని, ప్రతీసారీ ఈ రాజీనామాకు సంబంధించిన సవాళ్లే ఎదుర్కోవాల్సి వస్తోంది. పోనీ, సవాలును స్వీకరించి, తెగించి రాజీనామా చేసే పరిస్థితి ఉందా.. అంటే, అదీ లేదు! ఇదంతా ఫిరాయింపుల పుణ్యం కదా, ఇంకొన్నాళ్లు అనుభవించాల్సిందే.!