మనకు ఆవకాయ్ పచ్చడి తెలుసు. గోంగూర పచ్చడి తెలుసు. ఈమధ్య చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అంటూ పచ్చళ్లలో నాన్ వేజ్‌లూ తయారైపోయాయి. మరి ఈ యాపిల్ పచ్చడేంటి?? అనుకొంటున్నారా.. ఇది కె.విశ్వనాథ్ గారి రెసిపీ నుంచి పుట్టుకొచ్చింది. యాపిల్ పచ్చడి తయారు చేయడమే కాదు.. తన యూనిట్ వాళ్లందరికీ వడ్డించి, వాళ్ల చేత అద్భుతః అనిపించారు విశ్వనాథ్. అయితే ఇది ఇప్పటి సంగతి కాదు.. స్వర్ణకమలం నాటి విషయం. స్వర్ణకమలంలోని పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం కాశ్మీర్ వెళ్లింది. అక్కడ.. చాలా రోజుల పాటు యూనిట్ మకాం పెట్టేయాల్సివచ్చింది. వాతావరణం చలిచలిగా ఉంది. అందుకే… కారం కారంగా ఏమైనా తినాలనిపించిందట. తెలుగవాళ్లకి అసలే ఆవకాయ్ లేనిదే ముద్ద దిగదు. కానీ.. వంటవాళ్లు ఆవకాయ్ తీసుకురావడం మర్చిపోయారు. దాంతో కాశ్మీర్లో దొరికే పచ్చి యాపిల్స్‌తో ఆవకాయ్ పెట్టించార్ట విశ్వనాథ్. కాశ్మీర్ నుంచి తిరిగి సొంత ఊర్లకు వచ్చేంత వరకూ యాపిల్ పచ్చడే తింటూ కాలం గడిపారట యూనిట్ వాళ్లు. అదీ.. విశ్వనాథ్ వారి యాపిల్పచ్చడి కథ. ఈ ఐడియా ఏదో బాగుందే…!