ఒక ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకం లోకి నెడుతుంది. ఒక్కోసారి కుటుంబాన్నే ఛిద్రం చేసేస్తుంది. ప్రమాద కారణాలు ఏవైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వచ్చేవరకూ గ్యారంటీ లేకుండా పోయింది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో. దీనికి కారణం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులూ, నిర్మాణాలూ. శరవేగంగా సాగుతున్న ఈ కార్యకలాపాలు అప్పుడప్పుడు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అలాగని వీటిని ఆపేద్దామా! అలా ఆపడం సాధ్యం కాదు కదా. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నేళ్ళుగా సాగుతున్న హైదరాబాద్ మెట్రో పనులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన శరవేగాన్ని పుంజుకున్నాయి. పగటిపూట ఎలాగూ వేగంగా వెళ్ళడం కుదరదు. వాహనాలు రాసుకుంటూ వెడుతుంటాయి. రాత్రి పూట ఇందుకు భిన్నం. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. కుర్రకారు జోరును రెట్టింపు చేస్తాయి. ఈ సమయంలో ప్రమాదాలు సహజం. అవి చిన్నవైతే పరవాలేదు. ఏదో దెబ్బలతో బయటపడితే సంతోషమే. కానీ, వాహనదారులు గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతంగా ఛిద్రమైపోతున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితిశ్ దుర్మరణ ఘటన ఇందుకు ఉదాహరణ. నితీశ్ వేగంగా వెళ్లారా.. ఏ స్థితిలో ఆయనున్నారు.. అనే అంశాలను పక్కన పెడితే. ఆకాశాన్నంటేలా నిర్మిస్తున్న మెట్రో స్తంభాలు మెలికలు తిరుగుతున్న చోట సరైన జాగ్రత్తలు తీసుకున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం లేదనే వస్తుంది.
ఓ ఐదారేళ్ళ క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్లో జిహెచ్ఎమ్సీ ఉద్యోగులు రోడ్లు ఊడుస్తుండగా ఓ వాహనం దూసుకెళ్ళి నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నగర పాలక సంస్థ అప్పుడు కళ్ళు తెరిచింది. వేకువ ఝామున పారిశుద్ధ్య విధుల్లో ఉన్నవారికి రేడియం చారలుండే జెర్కిన్లను అందచేసింది. దీనివల్ల ఎంత వేగంగా వస్తున్న వారికైనా రోడ్డు మీద ఎవరో ఉన్నారనే స్పృహ వస్తుంది. ఆ విధంగా ప్రమాదాలు నివారించవచ్చనేది ఆలోచన. అదే చక్కగా ఫలించింది. దీనికారణంగా విధుల్లో ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది ప్రమాదాలకు గురైన సంఘటనలు దాదాపు లేవనే చెప్పాలి.
మెట్రో పనులు చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఆలోచన తట్టాలి కదా. స్థంభాల కారణంగా మెలికలు తిరిగే రోడ్డును గుర్తించేందుకు వీలుగా బాణం గుర్తులు వేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? చీకట్లో ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ అదనంగా దీపాలు ఏర్పాటు చేయడం.. రేడియం స్టిక్కర్లను అతికించడం చేయాలి కదా. మరీ ప్రమాదకరమైన మలుపైతే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి కదా. ఈ బాధ్యత కేవలం జిహెచ్ఎమ్సిది మాత్రమేనని నిర్థారణకు రాలేం. పనులు చేసే మెట్రో సంస్థకు అంతకు రెట్టింపు బాధ్యతుంటుంది. అది తన బాధ్యతను తెలుసుకకోలేకపోతే.. జిహెచ్ఎమ్సి దాన్ని గుర్తుచేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రయోజనం కోసం, సౌకర్యాల మెరుగు కోసం చేస్తున్న ఏర్పాట్లు అవి పూర్తయ్యేలోగా వందలాది ప్రాణాలను హరించేస్తే.. ఆ కుటుంబాలకు ఎంత కష్టం. కొడుకు పోయిన బాధ ఎలాఉంటుందో తనకు బాగా తెలుసని నటుడు హరికృష్ణ వ్యాఖ్య ఇందుకు తార్కాణం.
రోడ్డు ప్రమాదం వల్ల ఏ కుటుంబమూ నష్టపోకూడదు. అందుకు ప్రభుత్వం వైపు నుంచి కూడా సరైన సహకారముండాలి. ఫ్లైఓవర్ మీద నుంచి లారీ కింద వెడుతున్న ఆటో మీద వెడుతుంటేనే చిన్న పాటి గాయాలతో బయటపడుతున్న ఉదంతాలున్నాయి. రోడ్డుపై వెడుతున్న వారిని ప్రాణాలు కోల్పోకుండా కనీస ఏర్పాట్లు చేయలేమా అని ప్రతి ప్రభుత్వమూ ఆలోచించాలి. ఆ దిశగా అడుగులేయాలి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రోడ్లపై అర్ధరాత్రి దాటిన తరువాత రేసులు నిర్వహిస్తుంటారు.. పెద్ద కుటుంబాల వారే ఇందులో పాల్గొంటారనేది సత్యం. అజరుద్దీన్ కుమారుడు ఎలా కన్నుమూశాడు. ఈ ప్రమాదాలకు ఆ కుటుంబాలనే బాధ్యుల్ని చేసి వదిలేద్దామా! ఒత్తిళ్ళకు లొంగకుండా రేసుల్నీ, మద్యం తాగి వాహనాలు నడపకుండా యువతనూ పోలీసులు నిరోధించలేరా. మద్యం సేవించి చేసిన ప్రమాదంలో చిన్నారి రమ్య మరణించిన సంగతిని గుర్తుంచుకోండి. పోలీసులు కఠినంగానూ, ప్రణాళికాబద్ధంగానూ వ్యవహరిస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించడం సాధ్యమే. అదే సమయంలో ఏ సంస్థనైనా తన పని తాను చేసుకునే వీలును ప్రభుత్వాలూ కల్పించాలి. కాదంటారా!
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి