తెలుగుదేశం నేతలు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లనే మెజారిటీ సీట్లు వచ్చాయన్నది వాస్తవం. నాడు పవన్ వెంటబడి మరీ ప్రచారానికి తీసుకొచ్చారు. బహిరంగ సభల్లో చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ తరువాతి నుంచి పవన్ మీద టీడీపీ ధోరణిలో మార్పును గమనించొచ్చు! అవసరమైనప్పుడు పవన్ కావాలి అన్నట్టుగానే ఇప్పటీకీ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉంటోంది. అంతేకాదు… చంద్రబాబు రాజకీయంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారంటే… ఆ సమయంలో ఏదో ఒక రకంగా పవన్ ఎంట్రీ ఇవ్వడం, సేవ్ చేయడం జరుగుతున్నాయన్న ఆరోపణలు వింటూనే ఉన్నాం. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీకి పవన్ అవసరం ఉందనే అర్థమౌతూనే ఉంది. ఆ విషయం ఇతర టీడీపీ నేతలకూ తెలుసు. అందుకే, పవన్ ను విమర్శించాలంటే ఆచితూచి స్పందిస్తుంటారు.
ప్రస్తుతం టీటీడీ ఈవో నియామక వ్యవహారం హాట్ టాపిక్ గా నిలుస్తోంది కదా! ఉత్తరాది అధికారిని నియమించడంపై పవన్ విమర్శించారు. దానిపై టీడీపీ నేతలు కూడా కాస్త సున్నితంగానే ప్రతిస్పందించారు. కానీ, కేంద్రమంత్రి అశోక్ గజపతి మాత్రం పవన్ అంటే ఎవరో తెలీదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు! ద్వారక తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి అశోక్ గజపతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన దగ్గర పవన్ ప్రస్థావన వస్తే… ‘మీరేదో పేరు చెప్తున్నారు. ఆయన ఎవరో నాకు తెలీదు. నేను సినిమాలు పెద్దగా చూడను. థియేటర్ కి వెళ్లి చాలాయేళ్లయింది. సినిమాల గురించి మాట్లాడమంటే నేనేం చెప్పగలను..?’ అంటూ వ్యాఖ్యానించారు. సో… ఇదీ పవన్ గురించి కేంద్రమంత్రి స్పందించిన తీరు.
పవన్ గురించి ఇలా మాట్లాడటం అశోక్ గజపతికి భావ్యమా చెప్పండి. గత ఎన్నికల్లో పవర్ కరిజ్మాను వాడుకున్నది ఎవరో అశోక్ గజపతికి తెలీదా..? చంద్రబాబుతో కలిసి ప్రచారం చేసిన సంగతి మరచిపోయారా..? ఇప్పడు కూడా చంద్రబాబుకు పరోక్షంగా పవన్ సహకరిస్తున్నాడని అనుకుంటున్నారు, ఆ విషయమూ ఆయనకి అర్థం కానిదా..? కేంద్రమంత్రి ఇలా స్పందించడం నిజంగా దారుణమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
సో… పవన్ కల్యాణ్ అంటే టీడీపీలో ట్రీట్మెంట్ ఇప్పుడు ఇలా ఉందన్నమాట! విచిత్రం ఏంటంటే… పవన్ ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు స్పందించరు. ఇప్పుడు ఈ టీటీడీ ఈవో ఇష్యూ అనే కాదు. గతంలో కూడా టీడీపీ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు చేసినా కూడా చంద్రబాబు స్పందించలేదు. ఇతర నాయకులు పవన్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడూ అదే పరిస్థితి! ఈ తేడాని పవన్ గుర్తిస్తున్నారో లేదో..?