క్రికెట్ – సినిమా… రెండూ ఒక్కటే. ఎప్పుడూ ఆడని బ్యాట్స్‌మెన్ ఒక్క మ్యాచ్‌లో సెంచరీ చేశాడనుకోండి. వరుసగా ఆడినా, ఆడకపోయినా పది మ్యాచ్‌ల వరకూ ఆ బ్యాట్స్‌మెన్‌ని తీసే ప్రసక్తే ఉండదు. ఒక్క మ్యాచ్ పేరు చెప్పుకొని సిరీస్ సిరీస్‌లు ఆడేసినవాళ్లు, కెరీర్ సెటిల్ చేసుకొన్నవాళ్లు చాలామందే కనిపిస్తారు. సినిమాలు కూడా అంతే. ఓ సూపర్ డూపర్ హిట్ చేతికి వస్తే… కెఈర్ సెటిల్ అయిపోయినట్టే. ఇక బాహుబలి లాంటి మైల్ స్టోన్‌లాంటి సినిమా పడితే.. ఇంకేమైనా ఉందా??
బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా గతి పూర్తిగా మారిపోయింది. దేశంలోని సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది. వాళ్ల కెరీర్ మేలిమి మలుపు తిరిగింది. ఈ సినిమాతో బాగా లాభపడేవాళ్ల లిస్టులో రాజమౌళి, ప్రభాస్ ఉంటారు. వాళ్ల గోల్డెన్ డేస్ మొదలైపోయినట్టే. అడిగినంత పారితోషికం ఇవ్వడానికి, వంగి వంగి సలామ్ కొట్టడానికి నిర్మాతలు క్యూలో నిలబడడం ఖాయం. అనుష్క, తమన్నా కెరీర్ చాలా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు బాహుబలి 2 విడుదలైంది. ఈ ఎఫెక్ట్ తప్పకుండా వాళ్లపై పడే ఛాన్సుంది. ఇక శివగామి పాత్ర చెప్పి అనుష్క, కట్టప్పని చూపించి సత్యరాజ్ రెచ్చిపోవడం ఖాయం. ఈ పాత్రల్ని రాజమౌళి తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్రల్లో వీళ్లు చేసిన అద్భుతన ప్రదర్శన… ఇవన్నీ రమ్యకృష్ణ, సత్యరాజ్ ఇమేజ్‌ని వందింతలు చేశాయి. ఇక రానా గురించి ఏం చెప్పగలం? కొన్నాళ్ల పాటు విలన్ అంటే రానానే గుర్తొస్తాడు. విలన్ పాత్రలు ఇక మీదట చేసినా, చేయకపోయినా.. హీరోగా తన కెరీర్‌ని మరింత జోష్ గా ముందుకు నడపించడానికి భళ్లాలదేవ పాత్ర బాగా ఉపయోగపడుతుంది. బాహుబలి పేరు చెప్పుకొని ప్రభాకర్ లాంటి వాళ్లు ఆల్రెడీ.. సొమ్ములు చేసేసుకొంటున్నారు. మిగిలిన చిన్నా చితకా వాళ్లు కూడా… రంగంలోకి దిగిపోయారు.
ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. కథా రచయితగా అప్పుడే విజయేంద్ర ప్రసాద్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిపోయాడు. భజరంగీ భాయ్ జాన్ కూడా.. సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్‌లోనూ విజయేంద్ర ప్రసాద్ పేరు మార్మోగుతోంది. కెమెరామెన్ సింథిల్కి ఇప్పుడు బాలీవుడ్ తలుపులు తెరవడం ఖాయం. ఈ సినిమాకి సంగీతం అందించిన కీరవాణి కి బాలీవుడ్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు మరింత విరివిగా అక్కడి నుంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా చాలామంది కెరీర్‌కి బాహుబలి అద్భుతమైన ఫ్లాట్ ఫామ్ వేసింది. దాన్ని నిలుపుకొని.. సద్వినియోగం చేసుకొనేదెవరో కాలమే చెప్పాలి. బాహుబలి పేరు చెప్పి పారితోషికాలు పిండేద్దాం అనుకొంటే పొరపాటే.. బాహుబలి గౌరవమే కాదు, బాధ్యత కూడా. దాన్ని వీలైనంత గౌరవంగా… భద్రంగా కాపాడుకోవాలి.