ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ ఢిల్లీ పర్యటన ఇంకా పొలిటికల్ హీట్ పెంచుతూనే ఉంది. దీనిపై తెలుగుదేశం నేతలు ఒక్కొక్కరుగా స్పందించి, రోజుకో ప్రెస్ మీట్ అన్నట్టుగా మాట్లాడేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయమై విమర్శలు చేయడం విశేషం! వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ – మోడీ భేటీపై స్పందించారు. ఇంతకీ ప్రధాని మోడీని జగన్ ఎందుకు కలిశారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మోడీతో అంత రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం ఏముందనీ, ఆ భేటీ ఏయే విషయాలు చర్చకు వచ్చాయో ప్రజలకు చెప్పాలని నిలదీశారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే… కేంద్రం తీరుకు నిరసనగా రాజీనామాలు చేస్తామని చెప్పిన విపక్షనేత, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకి ఎలా మద్దతు ఇస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. హోదా విషయంలో కేంద్రాన్ని అడగడం లేదంటూ తమని విమర్శించేవారనీ, ప్రధానిని కలిసిన జగన్ ఆ విషయం ఎందుకు అడగలేదని అన్నారు. అయితే, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఏనాడూ మాట్లాడలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాడు భాజపాతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర సమస్యలపై అంతర్గతంగా చర్చించుకున్నామనీ, అంతేగానీ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడూ వ్యతిరేకించలేదనీ, ఇది సంకీర్ణ ధర్మమని చెప్పారు.
సో.. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించకపోవడమే సంకీర్ణ ధర్మం అన్నట్టుగా చెప్పారు! మరి, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల సంగతేంటీ..? క్రమశిక్షణ గల పార్టీగా అంతర్గత సమావేశాల్లో మాత్రమే సమస్య గురించి మాట్లాడాను అని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, అభివృద్ధికి సంబంధించిన సమస్య. దీనిపై అంతర్గతంగా ఒకలా, బహిర్గతంగా మరోలా చర్చ అనేది ఎలా ఉంటుంది..?
సరే, రాజీనామాలు చేస్తామని చెప్పి… వైకాపా చెయ్యలేదు, మాట తప్పారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ప్రధాని ముందు జగన్ ప్రస్థావించకపోవడమూ తప్పే. అందుకే జగన్ పర్యటన ఇంత చర్చకు ఆస్కారమిస్తోంది. అయితే, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేసింది..? చంద్రబాబు కూడా చాలాసార్లు ప్రధానిని చాలాసార్లు కలిశారు కదా. హోదాని ప్యాకేజీగా కన్వర్ట్ కాకుండా ఎందుకు ఆపలేకపోయారు..? ఏ సంకీర్ణ ధర్మం అడ్డొచ్చింది..? ఆ ధర్మం పేరుతో తాము చేసిన ప్రత్యేక హోదా ప్రయత్నాల్ని ఇప్పుడు సమర్థించుకుంటునట్టుగా ఉంది.