ఆమెకు అన్నీ తెలుసు.మనమే పట్టపగలు లైట్లేసిన స్టేడియంలో దాగుడుమూతలాడుతూ దొరికిపోయాం అంటాడు అత్తారింటికి దారేదీలో హీరో పవన్ కళ్యాణ్ మేనత్తగురించి. ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్ సర్కార్ పరిస్థితి అంతేఅయింది. ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమానికి పోటీగా స్థానికుల పేరిట పోలీసులను రంగంలోకి దింపింది. అనూహ్యమైన రీతిలో రెండు నిరసనలకు ఒకేచోట అనుమతినిచ్చారు పోలీసులు. తీరా స్థానికుల ముసుగులో కూచున్నది పోలీసులు టిఆర్ఎస్ నాయకులే. ఎందుకంటే చాలా ఏళ్లుగా నడుస్తున్న ధర్నాచౌక్తో స్థానిక ప్రజలకు ఎలాటి విభేదం లేదు. ఇంత రణం జరుగుతున్న తరుణంలోనూ వారు మంచినీళ్లిచ్చి సంఘీభావం చాటారు. ఎటొచ్చి మప్టీ పోలీసులు నిరసన శిబిరంలో వుండడమే ఉద్రిక్తతకు కారణమైంది. భారీ సంఖ్యలో వామపక్షాలు జెఎసి జనసేన కార్యకర్తలు వచ్చేసరికి తమ వారికి ఏమైనా అవుతుందేమోనని పోలీసులు భయపడ్డారు.బారికేడ్లు ధ్వంసం చేశారనే నెపంతో దారుణమైన లాఠీచార్జి చేశారు. వారి అనుకూల శిబిరంలో ఏలినవారు వేయించిన కుర్చీలున్నాయి గాని మనుషులు లేరు. అందుకే కార్యకర్తలు ఆ కుర్చీలను విరగ్గొట్టారు. లాఠీచార్జిలో దారుణంగా గాయపడింది వామపక్ష కార్యకర్తలే. కాని కమ్యూనిస్టులు దౌర్జన్యం చేశారంటున్న ప్రభుత్వం పోలీసులు వారి అనుకూల ఛానళ్లు అలా గాయపడిన వారిని ఒక్కరినైనా చూపించలేకపోయారు. ఇదిలావుంటే శ్రీదేవి అనే సిఐ స్థానికుల పేరిట ప్లకార్డు పట్టుకుని కూచున్న సంగతి కాస్త ఛానల్లలో ప్రసారమైంది. దాంతో ఈ రోజు ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. పాలకులు చెప్పారు కదా అని ఏదైనా చేసేందుకు సిద్ధమైతే పర్యవసానాలు ఇలా వుంటాయని అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఈ ఘటన. కమ్యూనిస్టులపై నిందారోపణలు చేసిన తర్వాత తనే నాలుక్కరుచుకోవడం పెద్ద గుణపాఠమే !