అమరావతి.. మహేంద్రుడి రాజధాని. ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి తలమానికంగా వెలుగొందేలా దీన్ని రూపుదిద్దుతున్నారు.చరిత్రలో ఇంతవరకూ ఒక్క గుజరాత్ రాజధాని గాంధీనగర్ నిర్మాణాన్నే దేశం ప్రత్యక్షంగా చూసింది. ఇప్పుడు యావత్ప్రపంచ దృష్టి అమరావతిపై పడింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించారని తెలిసిన మరుక్షణం అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి చెప్పిన మొదటి మాట రాజధాని నిర్మాణానికే 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయనీ, ఉదారంగా కొత్త రాష్ట్రానికి సహకరించాలనీ కేంద్రానికి మహజరు సమర్పించారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఆయన అదే పనిలో నిమగ్నమయ్యారు. మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి ధ్యాస అమరావతి నిర్మాణంపైనే. రాజధానిని ఎక్కడ నిర్మించాలన్న అంశంపై తీవ్రంగా శ్రమించి గుంటూరు, విజయవాడలకు మధ్య కృష్ణా నది ఒడ్డున ఉన్న సస్యశ్యామల గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. రైతలు స్వచ్ఛంగా ఇచ్చారని చెబుతున్న 33 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణానికి ప్రధాని సమక్షంలో పునాది వేశారు. అనేక డిజైన్లు రూపొందింపజేశారు.
160 ఎకరాల విస్తీర్ణంలో శాసన సభ
రాష్ట్ర శాసన సభ భవనానికే 160 ఎకరాలను కేటాయించారు. ఇందులో 140 ఎకరాలలో జల, హరిత అవసరాల కోసం విడిచిపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తుది ప్రణాళికలో కొన్ని మార్పులు సూచించినట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ కమిషనర్ శ్రీధర్ చెప్పారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులను ఉత్తర దిశగా కొద్దిగా ముందుకు జరిపారు. అమరావతి నగర నిర్మాణ పురోగతిపై బుధవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించినప్పుడు ఈ వివరాలు వెల్లడయ్యాయి. పరిపాలన నగర నిర్మాణ ఆకృతులు, ప్రణాళిక 90 శాతం పూర్తయ్యాయి. ఈనెల 12 నుంచి 16 వరకు లండన్‌లో ఆకృతులపై కార్యగోష్టిలో శాసనసభ, ప్రజారవాణా వ్యూహం, జల వనరులపై నార్మన్ ఫాస్టర్ బృందంతో విపులంగా చర్చించారు. ఈనెల 22న ఫాస్టర్ బృందం మలి విడత డిజైన్లు అందిస్తుంది. ఇప్పటికే 90 శాతం ప్రణాళిక పూర్తయ్యింది.
10 అంతస్తుల సెక్రటేరియట్
సచివాలయ భవంతి 8 నుంచి 10 ఫ్లోర్లతో ఉటుంది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మొత్తం 26 వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా ఉంటుంది. అంతర్జాతీయ నగరాల్లో ఓన్ యువర్ కార్, లీజ్ యువర్ కార్, రెంట్ యువర్ కార్ అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. అమరావతిలో డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తాయి. హైపర్ లూప్ టెక్నాలజీ, మెట్రో రైలు వ్యవస్థ, ఎలక్ట్రికల్ కార్లు, జల రవాణా, బీఆర్టీఎస్ వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థ బృహత్ ప్రణాళిక రూపొందిస్తారు. నగర ముఖ్య కూడలి నుంచి సచివాలయం వరకు డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తాయి. పరిపాలన నగరంలో ఒక చోట నుంచి మరొక చోటికి కాలినడకన చేరుకోవడానికి 5 నిమిషాలే పట్టే దూరంలో ఉంటాయి. బస్సు, రైలు, వాటర్ ట్యాక్సీలన్నింటికీ కలిపి ఒకే టికెట్ విధానం ప్రవేశపెడతారు. ప్రపంచంలో అత్యుత్తమంగా ఉన్న తొలి వంద ఫ్లైవోవర్లను పరిశీలించి రాజధానిలో నిర్మించేలా డిజైన్లు రూపొందిస్తారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి