ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలు చూస్తాం. మాటలు వింటాం. కాని ఆయనను భక్తిశ్రద్ధలతో అనుసరించి అభిమానం చూరగొన్నవారి అనుభవాల రూపంలో వింటే నమ్మలేనంత ఆశ్చర్యం కలుగుతుంది.
కంభంపాటి రామమోహనరావు మాజీ ఎంపి. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వం ఆయనకు పదవులు ఇవ్వలేదు గాని ఎన్టీఆర్‌తో మొదటి నుంచి వున్న ఒక నాయకుడు. విద్యార్థిదశలోనే ఎన్టీఆర్ కథానాయకుడి కథ షూటింగ్ సందర్భంగా గుంటూరులో కలుసుకున్నారు. ఆయనకు వారంతా కలసి వేసిన గజమాల ఆ చిత్రంలోనూ ఉపయోగించారు. అప్పటి నుంచి అభిమానిగా దగ్గరయ్యారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో మీరు రాజకీయాల్లోకి రావాలని అడుగుతుంటే అరవై తర్వాత వస్తాం బ్రదర్ అంటుండేవారట. తనకు గొప్ప జీవితమిచ్చిన తెలుగు వారికి ఏదైనా చేయాలనే తపన ఆయనలో స్పష్టంగా వుండిందన్నమాట. దానికి తగినట్టే రాజకీయ ప్రవేశానికి నిర్ణయం తీసుకోగానే యువకుడుగా వున్న రామమోహనరావును కూడా రప్పించారు. నాదెండ్ల భాస్కరరావు కూడా ప్రాంతీయ పార్టీకోసం ప్రయత్నిస్తూ ఎన్టీఆర్‌తో మాట్లాడిన మాట నిజమేనంటారు కంభంపాటి. ఏమైతేనేం పార్టీ ఏర్పాటుకు నిర్ణయమైంది. తమాషా ఏమంటే పార్టీ పతాకం ఎలా వుండాలో ఎన్టీఆర్ స్వహస్తాలతో బొమ్మ గీయడం. తర్వాత తెలుగుదేశం అన్న పేరు కూడా ఆయనే ఖాయం చేశారు. ఇక తనను నమ్మి అనుసరించిన కంభంపాటిని కొంతకాలం తర్వాత పోలీసు హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్‌ను చేశారు. మొదటి నాన్ పోలీసు చైర్మన్ ఆయన. ఆ సందర్భంగానే ఆయన ప్రారంభ కార్యక్రమంలో వుంటే ఎన్టీఆర్ ఫోన్ చేశారు. అతిధులందరూ చూస్తుండగానే ఇరవై నిముషాలు మాట్లాడారు. ఇబ్బంది పడిన కంభంపాటికి తర్వాత ఏం చెప్పారంటే కావాలనే అలా చేశాను. నువ్వు కుర్రాడిని వాళ్ల ముందు నీతో మాట్లాడ్డం ద్వారా నాకు ఎంత దగ్గరో తెలియజేశాను. అదీ పెద్దరికం!
మరో ఉదంతం డా.నాగం జనార్ధనరెడ్డి చెప్పారు. ఆయన ఎన్టీఆర్ టికెట్ ఇవ్వనందుకు అలిగి ఇండిపెండెంటుగా ఫోన్ చేసి గెలిచారు. అధిష్టానానికి దూరంగా ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఒకరోజు ఎవరికో ప్రసవం చేసి అలసి పోయి కూచుంటుండగా ఎన్టీఆర్ ఫోన్ వచ్చింది. వెంటనే బయిలుదేరి రేపు ఉదయం టిఫిన్‌కు రా అని ఆదేశం. మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదట. ఈయన వెళ్లారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూచోగానే ‘ఏదో జరిగిపోయింది. మర్చిపో. ఇక మామూలుగా వుండు’ అన్నారట. అంతే. నాగం ఈ కథ తెలుగుదేశంలో వున్నప్పుడే చెప్పారు నాకు. ఒక నాయకుడు పొరపొచ్చాలు వచ్చినా ఎలా సర్దుబాటు చేయాలో ఆయనను చూసి నేర్చుకున్నానని ఆయన జోహారులర్పించారు.
చివరి మాట ఒకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ అందరినీ చుట్టూ కూచోబెట్లుకుని కబుర్లు వింటూ కాలక్షేపం చేసేవారని ఎగతాళి చేశారట. అక్కడ వున్న ఒక నాయకుడు ఈ విషయం నాతో చెప్పి ‘ఎన్టీఆర్ తత్వాన్ని బాబుగానే అర్థం చేసుకోలేదు. అధికారికంగా సమావేశాలు చర్చల తరహాలో మాట్లాడితే విషయాలు బయిటకు రావు. యథాలాపంగా స్నేహంగా కబుర్లు చెబుతున్నప్పుడే ఆయన తనకు కావలసింది రాబట్టేవారు. న్యాయంగా పరిష్కరించేవారు. ఇది అర్థం చేసుకోలేదు గనకే చంద్రబాబు ప్రతిదాన్ని ఒకే మూసలోచేస్తుంటారు అని వ్యాఖ్యానించారు. ఆ నాయకుడు ఇప్పటికి చంద్రబాబు సన్నిహిత వర్గంలోనే వున్నారు!