2017 మే 28 ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఒక స్పష్టమైన రాజకీయ సంకేతమిచ్చింది. తెలుగుదేశం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా అంతర్గత ఆధిపత్యం నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబానికి పూర్తిగా మారిపోయింది. ఇది బయిటివారికి సంబందం లేనిదీ, నాకూ పెద్దగా ఆసక్తి లేనిది అయినా అవగాహన కోసం చెబుతున్నమాట. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒక విషయంలో స్పష్టంగా వున్నారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే ఒక స్థానం గౌరవం తప్ప నందమూరి వంశం అంతటికీ నేను స్థానం కల్పించలేను అని. జూనియర్ ఎన్టీఆర్ దగ్గరై దూరం కావడం జరిగిపోయిన సమయం అది. అంటూ ఎన్టీఆర్ పిల్లల పిల్లలకు తానేదో చేయబోవడం లేదు అని అర్థం. తన కుమారుడే గాక ఎన్టీఆర్ మనవడుగా కూడా లోకేశ్‌కు మాత్రమే ఆ అవకాశం పరిమితం అని ఆయన భావం. అతనికే తన కూతురునిచ్చిన బాలకృష్ణకు ఇదేమీ అభ్యంతరం కాదు, అయితే అంతకు ముందు చంద్రబాబు తిరుగుబాటులో ఆయన కన్నా తీవ్రంగా వ్యవహరించిన హరికృష్ణకు ఆయన కుమారుడే గాక ప్రముఖ హీరోగా వున్న జూనియర్‌కు నచ్చని పరిణామం ఇది. పురందేశ్వరి సరేసరి. వీరుగాక ఇంతగా కనిపించిన కుమారులు కుమార్తెలు వారి సంతతి వున్నారు. ఎపి రాజకీయాల్లో ఇకపై వీరెవరికీ చోటు వుండదనే అనుకోవచ్చు. జయంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ వద్ద వారే కనిపించారు. నారా భువనేశ్వరి బ్రాహ్మణి కూడా వచ్చారు. అయినా సరే అసలు సందడి మొత్తం విశాఖ తీరంలోనే వుండిపోయింది. సో- తెలుగు వైభవం నందమూరి కుటుంబం నుంచి నారా వారికి బదలాయించబడిందన్నమాట. సహజమే కదా! సమాధి దగ్గర హరికృష్ణ మాటల్లోనే ఆ నిష్టూరం స్పష్టంగా ధ్వనించింది.ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తప్ప ఏ రాష్ట్రంలోనూ( అంటే ఏపి అని చదువుకోవాలి) ఎవరూ( అంటే చంద్రబాబుతో సహా) కొత్తగా చేసింది లేదని హరిబాబు తేల్చేశారు. వారసులుగా ఎవరొచ్చినా విధానాలు మారేది లేదు గనక పట్టించుకోవలసిన పనిలేదు.
నిజానికి విశాఖ పట్టణంలో లోకేశ్ పట్ట గొప్ప ఆసక్తి పొంగిపొర్టినట్టు కొన్ని పత్రికలు రాశాయి. ఆయనే గాక ఒక పుత్ర సైన్యం అక్కడ సంచరిస్తున్నది. కళా వెంకట్రావు కుమారుడు మల్లిక్, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కుమారుడు ప్రసన్న,అయ్యన్న పాత్రుడి తనయుడు విజరు, శిల్పా మోహనరెడ్డి కుమారుడు రవి, జెసి దివాకర రెడ్డి కుమారుడు పవన్, ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్, గాలి ముద్దుకృష్ణమ కుమారుడుభాను ఇలా చాలా మందే వున్నారు.